
రాజకీయాల్లో ఆర్టిఫిషియల్ మంటలు
దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ ప్రజల దృష్టిని మరల్చడానికి ఆయా రాజకీయ పార్టీలు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటాయి. తద్వారా ఆ ఎన్నికల్లో లబ్ది పొందడానికి నిత్యం సమాజంలో మంటలు రేపుతుంటాయి. అనవసరమైన వివాదాలు, ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు ఆరోపణలు, అవాస్తమైన ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతుంటాయి. దీని ద్వారా అసలైన ప్రజా సమస్యలైన నిరుద్యోగం, ధరలు, అభివృద్ధి వంటి విషయాలను విజయవంతంగా పక్కదారి పట్టిస్తుంటాయి. రాజకీయాల్లో ప్రచారానికి పార్టీలకు ఇప్పుడు కొత్త ఆయుధం దొరికింది. రాజకీయ పార్టీలు ప్రస్తుతం ‘ఏఐ’(కృత్తిమ మేధస్సు) వీడియోలతో ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఒక చిన్న సంఘటనను భూతద్దంలో చూపి సమాజంలో వివాదాలను రేకేత్తిస్తున్నాయి. కావాలనే వివాదాలను రాజేసి చలికాచుకుంటున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేసి వినోదం చూస్తున్నాయి. దేశంలో రానున్న కాలంలో బీహార్, తమిళనాడు, అస్సాం తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అందుకు ఇప్పటి నుంచే అధిష్టాన ఆదేశాలతో ‘ఏఐ’ సాయంతో చేసిన వీడియోలను సోషల్ మీడియాలో వరుసగా విడుదల చేస్తున్నాయి. తద్వారా సమాజంలో విద్వేషాలు పెంచుతున్నాయి. ఇందులో ఆ పార్టీ, ఈ పార్టీ అని ఏది తక్కువగా లేదు. అన్ని పార్టీలు అదే బాటలో నడుస్తున్నాయి.
ప్రధాని మోడీ తల్లిపై కాంగ్రెస్ వీడియో
ఇటీవల బీహార్ లో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ పై కాంగ్రెస్ పార్టీ ఏఐ వీడియోను సృష్టించింది. అందులో ఆమె ప్రధానిని ఉద్దేశించి ‘సాహబ్ నిద్ర నుంచి మేలుకో’ అని చెబుతున్నట్లు దృశ్యాలు ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణలు చెప్పాలని, ఆ వీడియోను సృష్టించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని శిక్షించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అలాగే బీజేపీ నాయకులు ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని ఆదేశించింది.
అస్సాంలో ఓ వర్గం టార్గెట్
బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో రానున్న ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే బీజేపీ ఐటీ సెల్ ఓ వర్గం ప్రజలు రాష్ట్రంలోని మొత్తం వ్యవస్థలను ఆక్రమిస్తున్నారని, ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుంటే పరిస్థితి భయానకంగా ఉంటుందని రెచ్చగొట్టేలా ఓ ఏఐ వీడియోను రూపొందించారు. దీంతో రెండు వర్గాల ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు పెంచేలా ఉన్న వీడియోను తొలగించాలని ప్రతిపక్షాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దేశంలో ఈ విధంగా వీడియోలు వస్తుంటే ఎవరూ ఏమీ అడగరా? అని కొంతమంది ప్రశ్నించారు. రెచ్చగొట్టేలా ఉంటున్న ఇలాంటి వీడియోలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బీహార్ లో తేజస్వీయాదవ్ పై
ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహాఘట్బంధన్ పై వ్యంగంగా వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనను సీఎం అభ్యర్థిగా రాహుల్ గాంధీ ప్రకటించలేదని తన తండ్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కు చెబుతూ కంటతడి పెడుతున్న ఓ చిన్నపాటి వీడియోను వైరల్ చేశారు.
తమిళనాడులోనూ
ఇటీవల తమిళనాడులోనూ ఇటువంటి వీడియోలు కలకలం సృష్టించాయి. సినీ నటుడు, డీఎంకే వ్యవస్థాపకుడైన అన్నాదురై జయంతి సందర్భంగా తమిళ వెట్రి కళగం(టీవీకే) ఓ ఏఐ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. నేను ఏర్పాటు చేసిన డీఎంకేలో ప్రస్తుతం అవినీతి, వారసత్వం, అన్యాయం తదితర సామాజిక రుగ్మతలు పెరిగిపోయాయని అన్నాదురై చెబుతూ, ఈ సారి విజయ్ స్థాపించిన టీవీకేను ఆదరించాలని ప్రజలను కోరుతున్నట్లు ఉంది. దీంతో డీఎంకే నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీవీకేను విమర్శించారు. దీన్నీ ‘అత్యంత చవకబారు ప్రచారం’గా కొట్టిపారేసింది. డీఎంకే కూడా పెరియార్ రామస్వామి మాట్లాడినట్లుగా ఓ వీడియోను రూపొందించింది. అందులో తమిళ భావజాలాన్ని కాపాడే వారికి మద్దతివ్వాలని చెప్పినట్లుగా విడుదల చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రులు, దివంగత నాయకులైన కరుణానిధి, జయలలితలకు ఏఐ వీడియోలను కూడా వారి గొంతుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తెలంగాణలో
హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాద సమయంలో ఏఐ చిత్రాలు, వీడియోలు రూపొందించి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చింది. ప్రకృతిని, అందులోని మూగజీవాల ఆవేదనను ఆ దృశ్యాల్లో ప్రతిబింబించారు. ఈ అంశంపై ప్రభుత్వం కోర్టు వరకూ వెళ్లింది.
ఒకవైపు ఏఐని మంచి పనులకు ఉపయోగించుకుంటూ ఆయా పనులను ఖచ్చితత్వంతో పూర్తి చేస్తున్నారు. సాంకేతికతను అన్ని రంగాల్లోకి తీసుకొస్తూ, సృజనాత్మకతను జోడిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అదే సమయంలో ఇలాంటి విద్వేష పూరిత నకిలీ వీడియోలను ఏఐ సాయంతో రూపొందిస్తూ సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఏఐ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిది. దీనిపై నియంత్రణ ఉండాలని లేకుంటే ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
