Let's talk: editor@tmv.in
రాజకీయాల్లోని చెత్తనూ క్లీన్ చేస్తాం

రాజకీయాల్లోని చెత్తనూ క్లీన్ చేస్తాం

FL - SUNL
21 సెప్టెంబర్, 2025

రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్తను శుభ్రం చేసినట్లుగానే, సమాజం సంతోషంగా ఉండాలంటే రాజకీయాల్లోని చెత్తనూ క్లీన్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆ పనిని కూటమి ప్రభుత్వం చేస్తుందని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాచర్లలో గతంలో ప్రజాస్వామ్యం లేని పరిస్థితులను, రౌడీయిజం, నేరాలు, అరాచకాలను గుర్తు చేస్తూ, ఇకపై అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. "ప్రజలపై దాడులు, ఆస్తులపై దౌర్జన్యాలు చేసేవారిని ఉపేక్షించను. రాయలసీమలో ముఠాలను అదుపు చేసినట్లే, పల్నాడులోనూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా," అని ఆయన అన్నారు.

మనసుల్లోని చెత్తను తొలగించాలి

సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై మాట్లాడుతూ, "చెత్త తొలగింపుతో పాటు, మనసుల్లోని చెత్తను కూడా తొలగించాలి. చెత్తపై విధించిన పన్నును మేము తొలగించాం. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించే బాధ్యత తీసుకున్నాం. చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తాం," అని పేర్కొన్నారు. విశాఖ, గుంటూరులో ఇప్పటికే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయని, త్వరలో రాజమహేంద్రవరం, నెల్లూరు, కడప, కర్నూలులో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్టోబర్ 2 నాటికి మున్సిపాలిటీలు, జూన్ 26, 2026 నాటికి రాష్ట్రం మొత్తం ప్లాస్టిక్ రహితంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

తల్లికి వందనం

సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారని, "తల్లికి వందనం" కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా సాయం అందిస్తున్నామని, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేలు, ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా రూ.15 వేలు అందజేస్తున్నామని వివరించారు. అవినీతి లేకుండా 16,347 టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని, పేదరికం లేని సమాజ నిర్మాణమే తన లక్ష్యమని ఆయన చెప్పారు.

కార్మికులకు కోటి భీమా

జీఎస్టీ సంస్కరణల ద్వారా పన్నుల భారం తగ్గించి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచామని, అందరి ఆదాయం పెరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. సంజీవిని ప్రాజెక్టు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా అందరికీ రూ.2.50 లక్షల బీమా, పేదలకు ఎన్టీఆర్ వైద్యసేవ కింద రూ.25 లక్షల వరకు సాయం అందిస్తామని ప్రకటించారు. 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం ఉండాలని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు రూ.కోటి బీమా, పశువుల కోసం హాస్టళ్లు, షెడ్ల నిర్మాణం, గడ్డి సరఫరా చేస్తామని, మాచర్లను మోడల్ మున్సిపాలిటీగా మారుస్తామని సీఎం హామీ ఇచ్చారు. "తడి, పొడి చెత్తను వేరు చేయాలి. స్వచ్ఛాంధ్ర కోసం అందరూ ముందుకు రావాలి," అని పిలుపునిచ్చారు.

రాజకీయాల్లోని చెత్తనూ క్లీన్ చేస్తాం - Tholi Paluku