
రక్షణ రంగ స్టార్టప్‌లకు వెంచర్ క్యాపిటలిస్టులు మద్దతు ఇవ్వాలి: నీతి ఆయోగ్
భారతదేశంలోని రక్షణ రంగ స్టార్టప్‌లు గణనీయంగా ముందుకు వచ్చాయని, వాటి వృద్ధికి వెంచర్ క్యాపిటలిస్టులు మరింత ఆర్థిక మద్దతు అందించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్‌డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ వి.కె. సారస్వత్ అన్నారు. ఇక్కడ జరిగిన ‘అడ్వాంటేజ్ విదర్భ–2026 బిజినెస్ కాన్‌క్లేవ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్’ సందర్భంగా పీటీఐ వీడియోలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో రక్షణ భాగస్వామ్యం బలపడుతున్న నేపథ్యంలో, రష్యాతో ఉన్న దీర్ఘకాలిక సంబంధాలు దెబ్బతినకుండా ఎలా సమతుల్యత పాటించాలన్న ప్రశ్నకు స్పందిస్తూ, ఇది ఏ దేశాన్ని ఎంచుకోవాలన్న విషయం కాదు. మన భద్రతా అవసరాలు, ఆధునిక సాంకేతికత అవసరాలను ఎలా తీర్చుకోవాలన్నదే ప్రధాన అంశమని అన్నారు. భౌగోళిక-రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా, భారత్ తన అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
రక్షణ బడ్జెట్ ప్రాధాన్యం
2026–27 కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి భారీ కేటాయింపులు చేయడం, భవిష్యత్ యుద్ధాలకు అవసరమైన ఆయుధాలు, భారీ పరికరాల ఉత్పత్తిపై దేశం దృష్టి సారిస్తున్నట్లు సూచిస్తోందని ఆయన అన్నారు. ఈ బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించగా, ఇందులో రూ.2,19,306 కోట్లు సాయుధ దళాల మూలధన వ్యయానికి కేటాయించినట్లు తెలిపారు.
ఈ కేటాయింపులు స్వదేశీ ఉత్పత్తి (ఇండిజినైజేషన్), ప్రైవేట్ రంగ భాగస్వామ్యం పెంపు, ఉత్పత్తి వ్యయం తగ్గింపు, పోటీతత్వం పెంపు దిశగా ఉన్నాయని చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’లో నేర్చుకున్న పాఠాల ఆధారంగా, దీర్ఘశ్రేణి సూపర్‌సోనిక్ క్షిపణులు, దూరం నుంచే దాడి చేసే ఆయుధాల వంటి సాంకేతికతలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. భవిష్యత్ యుద్ధాలు నాన్-కాంటాక్ట్ వార్‌ఫేర్ దిశగా సాగనున్నాయని, అందుకు అనుగుణమైన సాంకేతికతపై పెట్టుబడులు పెరుగుతున్నాయని అన్నారు.
స్టార్టప్‌లకు మద్దతు అవసరం
రక్షణ పరిశోధనాభివృద్ధి రంగంలో కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ, శాస్త్ర-సాంకేతిక శాఖ, బయోటెక్నాలజీ శాఖలు కలిసి స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నాయని సారస్వత్ తెలిపారు. అయితే, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు ఇంకా ఆశించిన స్థాయిలో లేవని, వాటిని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భారత రక్షణ స్టార్టప్‌లు చాలా ముందుకు వచ్చాయి. వాటి వృద్ధికి తగిన ఆర్థిక మద్దతు లభిస్తే, దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయగలవని స్పష్టం చేశారు.
