
‘రక్షణ రంగం’లో మరో దేశంపై ఆధారపడటం సరైంది కాదు: డీఆర్‌డీఓ
రక్షణ రంగానికి అవసరమైన కీలక పదార్థాల అభివృద్ధిలో విదేశాలపై ఆధారపడటం సరైంది కాదని సమీర్ వీ కామత్ అన్నారు. వ్యవస్థల అభివృద్ధి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పదార్థాల అభివృద్ధి చక్రం కూడా అదే వేగంతో సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పదార్థాల అభివృద్ధికి 10–15 సంవత్సరాలు పడుతుండగా, వ్యవస్థల అభివృద్ధి చక్రం నిరంతరం తగ్గుతూ వస్తోందని తెలిపారు. ఢిపెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) చైర్మన్‌గా ఉన్న కామత్ న్యూఢిల్లీలోని సుబ్రోతో పార్క్‌లో జరిగిన రక్షణ రంగ సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలు, ఆయుధాలు, సెన్సర్ల అభివృద్ధికి పదార్థాలు కీలకమని, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను సాధించాలంటే కొత్త పదార్థాల అభివృద్ధి తప్పనిసరి అని ఆయన అన్నారు.
ఇతర దేశాలు ముందుగా ఉపయోగించిన తర్వాతే ఇస్తాయి
పదార్థాల అభివృద్ధి సాంకేతికత కోసం విదేశీ దేశాలపై ఆధారపడటం ప్రమాదకరమని కామత్ హెచ్చరించారు. ఇతర దేశాలు తమ వ్యవస్థల్లో ముందుగా ఉపయోగించిన తర్వాతే ఆ సాంకేతికతను అందిస్తాయని, అప్పటికే వారు తదుపరి తరానికి చెందిన సాంకేతికతలపైకి వెళ్లిపోతారని తెలిపారు. ప్రస్తుతం కొత్త రక్షణ వ్యవస్థలు ఐదేళ్ల వ్యవధిలోనే అభివృద్ధి చెందుతున్నాయని, డ్రోన్ల వంటి రంగాల్లో అయితే ప్రతి ఏడాది లేదా రెండేళ్లకే మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పదార్థాల అభివృద్ధి కూడా అదే వేగంతో జరగకపోతే కొత్త సాంకేతికతలను వినియోగంలోకి తీసుకురావడం కష్టమవుతుందని చెప్పారు. ఈ అభివృద్ధి కాలాన్ని తగ్గించేందుకు కంప్యూటేషనల్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను వినియోగిస్తున్నామని తెలిపారు. వచ్చే ఐదు నుంచి పది సంవత్సరాల్లో పదార్థాల అభివృద్ధి కాలాన్ని కూడా తగ్గించగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పదార్థాలను తయారుచేసిన తర్వాత వాటిని అవసరమైన ఉత్పత్తులుగా మార్చడం మరో కీలక సవాలుగా ఉంటుందని, ఇందుకు తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందని కామత్ అన్నారు.
రేర్ ఎర్త్ లోహాల్లో చైనాదే ఆధిపత్యం
కీలక ముడి పదార్థాల సరఫరాపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రేర్ ఎర్త్ లోహాల ఉత్పత్తిలో సుమారు 90 శాతం వాటాపై చైనా ఆధిపత్యం కలిగి ఉందని తెలిపారు. ముఖ్యంగా నీయోడిమియం–ఐరన్–బోరాన్ మాగ్నెట్ల తయారీలో ఉపయోగించే హెవీ రేర్ ఎర్త్ లోహాల్లో చైనా దాదాపు 99 శాతం నియంత్రణ కలిగి ఉందని చెప్పారు. టంగ్‌స్టన్ వంటి లోహాల విషయంలో కూడా భారత్ విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఈ వనరులు ఉన్నప్పటికీ వాటి తవ్వకం, వినియోగ సాంకేతికతలపై సరైన దృష్టి పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. దేశం సాంకేతిక రంగంలో స్వావలంబన సాధించాలంటే ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామత్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్’పై దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సును సెంటర్ ఫర్ ఎయిరోస్పేస్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, ఇండియన్ మిలటరీ రివ్యూ సంయుక్తంగా నిర్వహించాయి.
