Let's talk: editor@tmv.in
రక్షణ గోడ

రక్షణ గోడ

FL - TRND
8 అక్టోబర్, 2025

డ్రోన్‌ వాల్‌ ఇప్పుడీ పేరే యూరప్‌ అంతటా వినిపిస్తోంది. ఓవైపు గాలిలో తేలుతున్న భయం.. మరోవైపు ఆకాశం మీద తన్నుకొస్తున్న చీకటి.. ఎక్కడో దూరం నుంచి వచ్చే గర్జన ఒకప్పుడు యుద్ధాలు నేలమీద జరిగేవి. ఇప్పుడు గాలిలో జరుగుతున్నాయ్. కనిపించని కళ్లతో, మానవుడి ఆలోచనలతో, మెషీన్‌ల రూపంలో యుద్ధాలు భీకర రూపం దాల్చుతున్నాయ్. యుక్రెయిన్‌పై రష్యా వేసిన మొదటి డ్రోన్‌ అప్పట్లో ఎవ్వరికీ పెద్దగా కనిపించలేదు. కానీ ఆ శబ్దం, ఆ చిన్న గాలిమాట ఇప్పుడు యూరప్‌ అంతా విస్తరించింది. ప్రతి దేశం ఆకాశం వైపు చూస్తోంది. ఆ బజ్‌ శబ్దం వినిపిస్తే గుండె కొట్టుకుంటోంది. ఎవరి వైపు వస్తుంది? ఎవరి మీద దాడి చేస్తుంది? ఎవరు పంపారనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి మేఘంలో తేలుతున్నాయి. రష్యా, యుక్రెయిన్‌ యుద్ధం ఆరంభమైనప్పుడు ప్రపంచం దాన్ని ఒక ప్రాంతీయ ఘర్షణగా చూసింది. కానీ ఆ యుద్ధం సరిహద్దులు దాటింది. అందుకే యురప్‌ దేశాలు ఇప్పుడు డ్రోన్‌ వాల్‌పై దృష్టి పెట్టాయి. తమను తాము కాపాడుకునేందుకు కొత్త మార్గాన్ని కోరుకుంటున్నాయ్.

అయితే డ్రోన్ వాల్ సిమెంట్ గోడ కాదు.. ఇనుప గోడ కూడా కాదు. ఇది ఆకాశంలో కనిపించని రక్షణ వలయం. శత్రువుల డ్రోన్లను గుర్తించి, వాటిని ఆపి, వాటి మార్గాన్ని బ్లాక్ చేసే సాంకేతిక వ్యవస్థ. ఫిన్లాండ్, నార్వే, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్ లాంటి దేశాలు కలసి ఒకే కవచంగా తయారవుతున్నాయి. ఎందుకంటే రష్యా వైపు నుంచి వచ్చే ముప్పు ఇప్పుడు కేవలం నేలమీద యుద్ధం కాదు. అది గాలిలో దాగి వస్తుంది. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. డ్రోన్ వాల్ వెనుక ఉన్న భావం స్పష్టంగా ఉంది. ఎవరు డ్రోన్ల ద్వారా చొరబడి వస్తున్నారో ముందుగానే తెలుసుకోవాలి. డ్రోన్లను గుర్తించాలి. వాటిని అడ్డుకోవాలి. ఈ వ్యవస్థలో సెన్సార్లు ఉంటాయి. రాడార్లు ఉంటాయి. శబ్దాన్ని పసిగట్టే సాఫ్ట్‌వేర్‌లు ఉంటాయి. ఒక డ్రోన్ ఎగిరే ఎత్తు, దిశ, వేగం లాంటివి క్షణాల్లో గుర్తిస్తాయి. అవసరమైతే జామింగ్ టెక్నాలజీ ద్వారా ఆ డ్రోన్ సిగ్నల్‌ను బ్లాక్ చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్ యంత్రాలు దాన్ని నేలకేసి కొడతాయి. ఇది యూరప్ ఆకాశానికి పెట్టిన డిజిటల్ కవచం లాంటిది. ఇక డ్రోన్ వాల్ అనేది ఒక్క దేశం ప్రాజెక్ట్ కాదు. ఇది సరిహద్దులు దాటి ఏర్పడే భద్రతా వలయం. ఒక దేశం మీద దాడి జరిగితే పక్క దేశం కూడా వెంటనే స్పందిస్తుంది. ఒకదాని అలర్ట్ మరొకదానికి చేరుతుందన్నమాట.

ఇక ఈ డ్రోన్ వాల్ ఆలోచన రావడానికి చాలా కారణాలున్నాయి. యుద్ధం అనేది నేల మీదే జరుగుతుందని ప్రపంచం భావించేది. కానీ యుక్రెయిన్ యుద్ధం ఆ నమ్మకాన్ని పగలగొట్టింది. రష్యా డ్రోన్లతో చేసిన దాడులు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి. ఆకాశం నుంచి పేలుళ్లు, రాత్రిళ్లు మంటల్లో మునిగిన నగరాలు, ఆ దాడులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరూ చెప్పలేని భయం. ఆ భయం యూరప్ అంతటా చేరింది. యుద్ధం యుక్రెయిన్‌లోనే జరుగుతోంది కానీ దాని ప్రతిధ్వని యూరప్ గాల్లో మార్మోగుతోంది. పోలాండ్ మీద దూసుకొచ్చిన ఒక డ్రోన్ సరిహద్దు దాటి పడింది. డెన్మార్క్ వైపు ఒక అనుమానాస్పద యంత్రం కనిపించింది. ఎవరు పంపారు, ఎందుకు పంపారు, ఎవరి మీద పరీక్షగా వాడారో ఎవరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఉంది. యుద్ధం ఇప్పుడు కేవలం రష్యా-యుక్రెయిన్ మధ్య మాత్రమే లేదు. అది యూరప్ వరకు చొరబడింది.

నిజానికి చౌకగా తయారు చేయగలిగే డ్రోన్లు లక్షల్లో తయారవుతున్నాయి. వాటిని పట్టుకోవడం కష్టం, ఆపడం మరింత కష్టం. యుక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాలు కూడా డ్రోన్లను బలంగా వాడాయి. వాటి వల్లే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ అనుభవం యూరప్‌కి ఒక హెచ్చరికలా మారింది. రేపు ఇదే పరిస్థితి మన దేశాల్లో వస్తే ఏం చేయాలనే ఆలోచన నుంచే డ్రోన్ వాల్ ఐడియా పుట్టింది. డ్రోన్ వాల్ అనేది యుద్ధాన్ని అడ్డుకునే ప్రయత్నం. ప్రతి సిగ్నల్‌ని పసిగట్టే గోడ. ప్రతి దాడిని ఆపే కవచం. ఇది మానవ భయానికి సాంకేతిక సమాధానం. గాలి మీద తేలే యంత్రాల నడుమ, కనిపించని శత్రువుల నీడలో, ప్రపంచం తన కొత్త రక్షణను కట్టుకుంటోంది. ఆ రక్షణే ఈ డ్రోన్ వాల్. ఇదండీ డ్రోన్‌ వాల్ సంగతి.. మరి చూడాలి ఈ డ్రోన్‌ వాల్‌ రష్యా దాడులను ఎలా అడ్డుకుంటుందో వెయిట్ అండ్ సీ!

రక్షణ గోడ - Tholi Paluku