
రిక్షా డ్రైవర్‌ను హత్య చేసిన ఇంటర్ విద్యార్థి
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఒక ఈ-రిక్షా డ్రైవర్ హత్య కేసును పోలీసులు నెలరోజుల సుదీర్ఘ విచారణ తరువాత ఛేదించారు. సాధారణంగా హత్య కేసులో ఏదో ఒక ఆధారం, సాక్షి లేదా కారణం ఉంటుంది. కానీ ఈ హత్యలో ఎటువంటి ఆధారాలు లేకపోవడం మొదట్లో పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. కానీ అధికారులు సీసీ కెమెరా ఫుటేజ్, టెక్నికల్ సర్వైలెన్స్ ఆధారంగా చేసుకొని దర్యాప్తు కొనసాగించి ఎట్టకేలకు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హత్యకు పాల్పడిన వ్యక్తి 11వ తరగతి చదువుతున్న విద్యార్థి అని బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు సంగమ్ లాల్ (50) ఝాన్సీ నుంచి వచ్చి అయోధ్యలో రిక్షా నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఆగస్టు 26న రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు స్థానిక పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఉదయం నవాబ్‌గంజ్‌లోని అడవి ప్రాంతంలో సంగమ్‌లాల్ మృతదేహాన్ని గుర్తించారు. శరీరానికి ఎలాంటి గాయాలు లేకపోవడంతో కేసు ఇంకా క్లిష్టమైంది. అయితే సంఘటన స్థలంలో సంగమ్ లాల్ పర్సు, ఆధార్ కార్డు బయటపడి ఉండటంతో దొంగతనం జరిగినట్లు పోలీసులు అనుమానించారు.
దీంతో ఈ కేసును ఛేదించడానికి పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా స్థానిక పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, సర్వైలెన్స్ టీములు కలిసి పని చేశాయి. ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ సహకారంతో ఆధారాలు వెతికారు. అయోధ్య రైల్వే స్టేషన్ పరిసరప్రాంతాల సీసీ కెమెరాలను రోజుల తరబడి విశ్లేషించారు.
చివరికి సెప్టెంబర్ 22న కేసు కీలక మలుపు తిరిగింది.ఝాన్సీ జిల్లా బబీనా ప్రాంతంలో హాస్టల్‌లో ఉంటున్న ఒక విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని విచారించగా తానే ఈ హత్య చేశానని నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు ఆశ్చర్యకరమైన నిజాలను బయటపెట్టాడు. ఆగస్టు 26న రైలులో అయోధ్య చేరిన బాలుడు ఆలయ దర్శనం కోసం సంగమ్‌లాల్ రిక్షా ఎక్కాడు. ఆలయ దర్శనానికి సమయం ఉందని చెప్పి రిక్షా డ్రైవర్ అతడిని చాలా సేపు అక్కడే తిప్పి కొంత సమయం తరువాత ఒక నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అసాంఘిక కార్యకలాపాలు చేయమని ఒత్తిడి చేశాడని ఆ సమయంలో ఏం చేయాలో తోచక తన వద్ద ఉన్న ఒక గుడ్డతో గొంతు నులిమి హత్య చేశానని బాలుడు వివరించాడు.
బాలుడిపై కేసు నమోదు చేసిన అధికారులు నిందితుడిని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచి జువెనైల్ రీహాబిలిటేషన్ హోమ్ కు తరలించారు. అనంతరం ఈ కేసులో మరెవరైనా సహకరించారా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎస్ఎస్పీ వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ సాక్షులు, స్పష్టమైన కారణం లేని బ్లైండ్ మర్డర్ వంటి కేసులలో సరైన పద్ధతిలో దర్యాప్తు చేస్తే నిందితులను పెట్టుకోవచ్చు అని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆధునిక టెక్నాలజీ, సంప్రదాయ పద్ధతులు, విభాగాల సమన్వయం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.
