
రంపచోడవరంలో ఆరుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులపై భద్రతా దళాల కట్టుదిట్టమైన ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టు టాప్ లీడర్ మడవి హిడ్మా హతమై 24 గంటలు కూడా గడవకముందే, రంపచోడవరం అటవీ ప్రాంతంలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో కనీసం ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. చత్తీస్‌గఢ్, తెలంగాణ దిశ నుంచి మావోయిస్టులు ఆంధ్రలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో నేడు జరిగిన కాల్పుల్లో మావోయిస్టులు మరణించారు. మిగిలిన వారు సరెండర్ అయితే ప్రాణాలతో ఉంటారని సూచిస్తున్నామని మీడియాతో చెప్పారు.
17న ఆపరేషన్ ప్రారంభం – 18న హిడ్మా ఎన్ కౌంటర్
నవంబర్ 17 నుంచి ఆపరేషన్ ప్రారంభించినట్లు డీజీపీ వివరించారు. 18న ఉదయం అల్లూరి సీతారామ రాజు జిల్లాలో జరిగిన ఎదురుదాడిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మా సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. నిఘా ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా దాడులు నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ , కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఇప్పటికే మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరిలో ముగ్గురు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 23 మంది ప్లాటూన్ సభ్యులు, ఐదుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, 19 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అరెస్టులు చేశాం. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం:
సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, వెస్ట్ బస్తర్ జిల్లాల్లో భద్రతా దళాల కూంబింగ్ ఆపరేషన్లు పెరగడంతో ఇటువైపు వస్తున్నారన్నారు. హిడ్మా మరణం కారణంగా అక్కడ మావోయిస్టులు చెల్లాచెదురయ్యారని చెబుతున్నారు. వీరిలో చాలామంది ఆంధ్రలోకి ప్రవేశించి, పట్టణాల్లో తాత్కాలికంగా దాక్కొని, మళ్లీ కూడగట్టుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ ఆధారంగా ఖచ్చితమైన సర్జికల్ ఆపరేషన్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ మహేశ్‌కుమార్ లడ్డా, ఎస్‌ఐబీ చీఫ్ పీహెచ్‌డీ రామకృష్ణ పర్యవేక్షణలో బహుళ ఏజెన్సీలు సంయుక్తంగా అమలు చేశాయి. విజయవాడ సిటీ పోలీస్, సంబంధిత జిల్లాల ఎస్పీలు కలిసి ఆపరేషన్‌ను నిర్వహించారు.
గత ఏడాది కీలక విజయాలు
ఆంధ్ర పోలీసులు గత ఏడాది వరుసగా ప్రధాన మావోయిస్టు నేతలను ఎన్ కౌంటర్ చేశారు. అందులో ఏఎస్‌ఆర్ జిల్లాలో కాకురి పాండన్న (జగన్) – మే 2025న, దేవిపట్నంలో సెంట్రల్ కమిటీ సభ్యుడు గజర్ల రవి (ఉదయ్), సీనియర్ లీడర్ అరుణ – జూన్ 2025, ఏఓబీ–దక్షిణ బస్తర్‌లో మావోయిస్టు ఉద్యమం సన్నగిల్లుతోంది. ఉదయ్, జగన్, అరుణ, హిడ్మా వంటి కీలక నేతల హత్యలు, మరో 50 మంది కీలక క్యాడర్ల అరెస్టుతో
ఆంధ్ర–ఒడిశా సరిహద్దు దక్షిణ బస్తర్ ప్రాంతాల్లో మావోయిస్టుల వ్యవస్థ పూర్తిగా క్షిణించిందని పోలీసులు ప్రకటించారు.
