Let's talk: editor@tmv.in
రంజీ ఫైనల్‌ ముంగిట జమ్మూకశ్మీర్!

రంజీ ఫైనల్‌ ముంగిట జమ్మూకశ్మీర్!

Shaik Mohammad Shaffee
18 ఫిబ్రవరి, 2026

దేశవాళీ క్రికెట్ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో ఆసక్తికర పోరు సాగుతోంది. కళ్యాణిలో జరుగుతున్న మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్ సంచలన విజయం దిశగా సాగుతోంది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (8/90) కెరీర్ బెస్ట్ గణాంకాలతో విరుచుకుపడినా, బెంగాల్ జట్టు ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ చేసిన 328 పరుగులకు సమాధానంగా జమ్మూకశ్మీర్ 302 పరుగులకు ఆలౌట్ కావడంతో బెంగాల్‌కు 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత భారత జట్టుకు దూరమైన షమీ, ఈ ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో 36 వికెట్లతో ఆయన టాప్ వికెట్ టేకర్ల జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నారు.

కుప్పకూలిన బెంగాల్.. లక్ష్యం 126

షమీ శ్రమను బెంగాల్ బ్యాటర్లు వృథా చేశారు. జమ్మూకశ్మీర్ పేసర్లు ఆకిబ్ నబీ (4/36), సునీల్ కుమార్ (4/27), యుధ్వీర్ సింగ్ (2/29) ధాటికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్ అహ్మద్ (24) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. ఫైనల్‌కు చేరాలంటే ఆ జట్టు మరో 83 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో శుభమ్ పుండిర్ (23), వన్షజ్ శర్మ (9) ఉన్నారు. చేతిలో ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో జమ్మూకశ్మీర్ శిబిరంలో పండగ వాతావరణం నెలకొంది.

కర్ణాటక పరుగుల వరద.. 736 పరుగుల భారీ స్కోరు

మరోవైపు లక్నో వేదికగా జరుగుతున్న మరో సెమీఫైనల్లో ఉత్తరాఖండ్‌పై కర్ణాటక పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. దేవదత్ పడిక్కల్ (232) అద్భుత ద్విశతకంతో కదం తొక్కగా.. రవిచంద్రన్ స్మరణ్ (135), కృతిక్ కృష్ణ (60), విద్యాధర్ పాటిల్ (50) మెరుపులతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 736 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఉత్తరాఖండ్ బౌలర్లలో ఆదిత్య రావత్ 4 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాఖండ్.. కర్ణాటక బౌలర్ల ధాటికి మూడో రోజు ముగిసే సమయానికి 149 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లక్ష్యరాజ్ రాయ్‌చందానీ (52) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్ పాటిల్ రెండు వికెట్లు తీయగా, ప్రసిద్ధ్ కృష్ణ, వైశాఖ్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.