
రంజీ ఫైనల్: కర్ణాటకపై జమ్మూకశ్మీర్ భారీ ఆధిక్యం
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ తుది పోరులో జమ్మూకశ్మీర్ జట్టు చారిత్రక విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఎనిమిది సార్లు ఛాంపియన్‌గా నిలిచిన బలమైన కర్ణాటక జట్టుపై తొలిసారి ఫైనల్‌కు చేరిన జమ్మూ కశ్మీర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక తన మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ప్రస్తుతం కర్ణాటక ఇంకా 364 పరుగుల భారీ వెనుకంజలో ఉంది.
పరుగుల వరద పారించిన జమ్మూ కశ్మీర్
తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూ కశ్మీర్ బ్యాటర్లు పట్టుదలతో ఆడి ఏకంగా 584 పరుగుల భారీ స్కోరు సాధించారు. శుభమ్ పుందిర్ (121; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. ఓపెనర్ యావర్ హసన్ (88) తృటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ పుందిర్‌తో కలిసి రెండో వికెట్‌కు 139 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరితో పాటు కెప్టెన్ పారస్ డోగ్రా (70), వికెట్ కీపర్ కన్హయ్య వాధవాన్ (70), సాహిల్ లోత్రా (72), అబ్దుల్ సమద్ (61) అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో జమ్మూ కశ్మీర్ భారీ స్కోరును అందుకుంది. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లతో రాణించగా.. విద్యాధర్ పాటిల్, వైశాఖ్, శ్రేయాస్ గోపాల్, శిఖర్ శెట్టి తలో వికెట్ తీశారు.
మయాంక్ పోరాడినా..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటకకు ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (13), కెప్టెన్ దేవదత్ పడిక్కల్ (11), కరుణ్ నాయర్ (0), స్మరణ్ రవిచంద్రన్ (0) విఫలమయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (130 నాటౌట్; 17 ఫోర్లు) అజేయ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. శ్రేయాస్ గోపాల్ (27) అతడికి కాసేపు సహకరించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మయాంక్ క్రీజులో ఉన్నాడు. చేతిలో 5 వికెట్లు ఉన్న కర్ణాటక.. జమ్మూ కశ్మీర్ నిర్దేశించిన భారీ స్కోరును చేరుకోవాలంటే అద్భుతం జరగాల్సిందే.
మ్యాచ్ గమనమిదీ..
తొలి రోజు 284/2 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచిన జమ్మూ కశ్మీర్, రెండో రోజు వెలుతురు లేమితో ఆట నిలిచే సమయానికి 527/6 స్కోరు చేసింది. మూడో రోజు మరో 57 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. మొదటిసారి ఫైనల్ ఆడుతున్న జమ్మూ కశ్మీర్, దిగ్గజ జట్లకే చెమటలు పట్టిస్తూ టైటిల్ దిశగా దూసుకెళ్తుండటం గమనార్హం.
