
రంజీ ట్రోఫీలో సంచలనం: ఎనిమిది సిక్సర్లతో చెలరేగిన ఆకాశ్ కుమార్ చౌదరీ
రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో మేఘాలయ క్రికెటర్ ఆకాశ్ కుమార్ చౌదరీ చరిత్ర సృష్టించాడు. అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేసి, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. వరుసగా ఎనిమిది సిక్సర్లు బాదడం ద్వారా మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో రోజు ఎడమచేతి స్పిన్నర్ లిమార్ డాబీ వేసిన 126వ ఓవర్‌లో ఆయన ఆరు సిక్సులు బాదాడు. అనంతరం 127 ఓవర్ లో వరుస రెండు బంతుల్లో మిగతా రెండు సిక్స్ లు కొట్టి ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో రవీ శాస్త్రి, గ్యారీ సోబర్స్ సరసన చేరాడు.
మొదట ఒక డాట్ బాల్, రెండు సింగిల్స్ తీసుకున్న ఆకాశ్, తరువాత రాకెట్ దూసుకుపోయినట్టు ఎనిమిది వరుస బంతుల్లో 8 సిక్సులు కొట్టాడు. ఫిఫ్టీ కేవలం తొమ్మిది నిమిషాల్లో పూర్తయింది. సమయం పరంగా ఇది చరిత్రలో రెండో వేగవంతమైనది. (మొదటిది క్లైవ్ ఇన్‌మన్, 1965లో 8 నిమిషాల్లో 13 బంతుల్లో 50). ఈ ఘనతకు ముందు రికార్డు వేన్ వైట్ (2012) పేరిట ఉంది.ఆయన 12 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు.
25 ఏళ్ల ఆకాశ్ ఇప్పటివరకు 31 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఆయన రికార్డు సాధారణంగా ఉండగా, ఈ ఇన్నింగ్స్‌తో స్టార్‌గా నిలిచాడు. ఆయన 14 బంతుల్లో 50 పరుగులు (8 సిక్సులు) చేసి నాటౌట్‌గా నిలిచాడు.
జట్టు ఆటతీరు
• మేఘాలయ 628/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
• ఆర్పిట్ భతేవారా – 207 (273 బంతులు, 25 ఫోర్లు, 4 సిక్సులు)
• కిషన్ లింగ్డోహ్ – 119 (187 బంతులు, 14 ఫోర్లు, 1 సిక్స్)
• రాహుల్ దలాల్ – 144 (102 బంతులు, 12 ఫోర్లు, 9 సిక్సులు)
తదుపరి ఇన్నింగ్స్‌లో అరుణాచల్‌ప్రదేశ్ 27.4 ఓవర్లలో కేవలం 73 పరుగులకే కుప్పకూలింది.
ఆర్యన్ బోరా 4 వికెట్లు (4/16) తీయగా, అత్యధికంగా అమిత్ యాదవ్ (16) పరుగులు సాధించాడు.ఏ బ్యాట్స్‌మెన్ కూడా 20 పరుగుల మార్కును దాటలేదు.
