Let's talk: editor@tmv.in
రంజాన్- 2026 ఏర్పాట్లుపై మంత్రి అజారుద్దీన్ సమీక్ష

రంజాన్- 2026 ఏర్పాట్లుపై మంత్రి అజారుద్దీన్ సమీక్ష

Gaddamidi Naveen
22 జనవరి, 2026

రాష్ట్రంలో రాబోయే రంజాన్ 2026 పండుగ ఏర్పాట్లు, మైనారిటీ సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వ రంగ సంస్థలు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ బుధ‌వారం తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రంలోని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో ప్రధానంగా రంజాన్ మాసానికి సంబంధించిన ఏర్పాట్లు, షాదీ ముబారక్ పథకం అమలు, ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం పనుల పురోగతి, క్రిస్మస్ వేడుకల కోసం కేటాయించిన నిధుల వినియోగంపై మంత్రి సమీక్షించారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఆలస్యం లేకుండా షాదీ ముబారక్ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రంజాన్ నెలలో ముస్లిం సోదరులు సౌకర్యవంతంగా ఉపవాసాలు, ప్రార్థనలు నిర్వహించుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు, మత పెద్దలతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రధానమంత్రి జన్ వికాస్ కింద చేపట్టిన పనులను ప్రాధాన్యంగా పర్యవేక్షించి, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. మైనారిటీల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్ని పథకాలు పారదర్శకంగా, సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.