
రంజాన్ వేళా ఇమామ్‌లు, మౌజన్లకు శుభవార్త..రూ.45 కోట్లు విడుదల
పవిత్ర రంజాన్ మాసం వేళ రాష్ట్రంలోని ముస్లిం మతపెద్దలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇమామ్‌లు, మౌజన్ల గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం మంగళవారం రూ.45 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మతపెద్దల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరు నెలల బకాయిలు క్లియర్
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం 2025 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు అంటే ఈ నెలాఖరు వరకు ఉన్న గౌరవ వేతన బకాయిలను ఈ నిధులతో పూర్తిగా చెల్లించనున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ నిధుల విడుదల కోసం మతపెద్దల నుంచి వచ్చిన అభ్యర్థనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సోమవారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్న సీఎం, ఈ అంశంపై అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
5,000 మసీదులకు ప్రయోజనం
ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 5,000 మసీదులకు చెందిన ఇమామ్‌లు, మౌజన్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ప్రతి మసీదుకు నెలకు రూ.15,000 చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పండుగకు ముందే ఈ బకాయిలు విడుదల కావడంతో ఇమామ్‌ల కుటుంబాలకు పెద్ద ఎత్తున ఆర్థిక వెసులుబాటు కలగనుంది.
మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సీఎం
ముస్లిం మైనారిటీల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. వారి సేవలను గుర్తించడమే కాకుండా గౌరవప్రదమైన జీవనం సాగించేలా చూడటం ప్రభుత్వ బాధ్యతని ఆయన పేర్కొన్నారు.
