
రంజాన్ మాసం: ముస్లిం ఉద్యోగులకు గంట ముందుగా వెళ్లేందుకు సర్కార్ అనుమతి
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముస్లిం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, బోర్డులు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి రంజాన్ నెలలో సాయంత్రం 4 గంటలకు కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతినిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ మేరకు ఒక మెమోను విడుదల చేశారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఈ సడలింపు అమల్లో ఉండనుంది. రంజాన్ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించుకునేందుకు సౌకర్యంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇక విద్యాశాఖ కూడా రంజాన్ నెలను దృష్టిలో ఉంచుకుని ఉర్దూ మాధ్యమ పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది.పాఠశాలల పనివేళలను ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.
ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ప్రభుత్వం ఇలాంటి అనుమతి ఇవ్వగా, గతంలో ఈ అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహా ఇతర బీజేపీ నేతలు ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. 41 రోజుల పాటు కఠినమైన నియమాలతో 'అయ్యప్ప దీక్ష' తీసుకునే భక్తులకు, ఇతర హిందూ పండుగల సమయంలో ఇటువంటి వెసులుబాట్లు ఎందుకు ఇవ్వడం లేదని వారు నిలదీశారు. దీక్షలో ఉన్న భక్తులు తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే నియమాలు పాటించడం కష్టతరమవుతోందని, ప్రభుత్వం అందరి పట్ల సమానంగా వ్యవహరించాలని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ ఉత్తర్వులతో ముస్లిం ఉద్యోగులు ప్రార్థనల కోసం గంట ముందుగా వెళ్లేందుకు మార్గం వెల్లడించింది.
