Let's talk: editor@tmv.in
రంజాన్ మాసం.. మానవత్వానికి దారిచూపే సందేశం

రంజాన్ మాసం.. మానవత్వానికి దారిచూపే సందేశం

Dantu Vijaya Lakshmi Prasanna
19 ఫిబ్రవరి, 2026

భారతదేశంలో నేటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు చేసే కఠిన ఉపవాస దీక్షలకు ఈ రోజు నుంచి సిద్ధమవుతారు. ఈ నేపథ్యంలో అసలు రంజాన్ అంటే ఏమిటి? ఈ సంస్కృతి ఎలా మొదలైంది? ఈ మాసంలో పాటించే నియమాల వెనుక ఉన్న ఆంతర్యమేమిటో లోతుగా తెలుసుకుందాం.

రంజాన్ అంటే ఏమిటి?

ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెలను 'రంజాన్' అని పిలుస్తారు. ఈ నెల అత్యంత పవిత్రమైనదిగా భావించడానికి ప్రధాన కారణం 'ఖురాన్'. ముస్లింల నమ్మకం ప్రకారం, క్రీస్తుశకం 610వ సంవత్సరంలో అల్లాహ్ తన దూత జిబ్రయీల్ ద్వారా మహమ్మద్ ప్రవక్తకు ఖురాన్ గ్రంథంలోని తొలి వాక్యాలను ఈ మాసంలోనే వెల్లడించారు. దీనినే 'లైలతుల్ ఖద్ర్' (ఘనమైన రాత్రి) అని పిలుస్తారు. అప్పటి నుంచి ఈ మాసం దైవ చింతనకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు వేదికగా మారింది. ఈ నెలలో చేసే ప్రార్థనలలో ఉపవాసం కూడా ఓ భాగం. ఉపవాసం ద్వారా వారు దేవుడికి దగ్గరగా ఉన్నట్లు భావించి వారి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని, స్వీయ క్రమశిక్షణను మెరుగు పరుచుకుంటారు.

ఇస్లాం ఐదు స్తంభాలు - ఉపవాసం

ఇస్లాం మతం ఐదు ముఖ్యమైన సూత్రాల మీద ఆధారపడి ఉంది. అవి, షహదత్ (దైవం ఒక్కడే అని నమ్మడం), నమాజ్ (ప్రార్థన), జకాత్ (దానం), హజ్ (మక్కా యాత్ర) రోజా (ఉపవాసం). రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం ప్రతి ఆరోగ్యవంతుడైన ముస్లింకు విధిగా నిర్ణయించబడింది. ఇది కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, చెడు ఆలోచనలు, అబద్ధాలు, కోపానికి దూరంగా ఉండటం కూడా ఇందులో భాగమే.

రంజాన్ పండుగలో ఉపవాసం ప్రధానమైనది. ఈ నెలంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాసం ఆచరిస్తారు. ఈ ఉపవాసాన్ని పార్సీలో రోజా అని అలాగే అరబ్బీలో సౌమ్ అని పిలుస్తారు. ఈ ఉపవాసం పాటించడం ద్వారా స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ అలవడుతుందని విశ్వాసం. ఇక రంజాన్‌ మాసంలో జకాత్ చెల్లించాలని చెబుతారు. అంటే తమ సంపదలో కొంత పేదలకు దానం చేయాలన్నది నియమం. ఇఫ్తార్‌ విందు కూడా రంజాన్‌ పండుగ వేళ ముఖ్యమైన సంప్రదాయంగా ముస్లింలు భావిస్తారు.

తెల్లవారుజామున 'సెహ్రి'.. సాయంత్రం 'ఇఫ్తార్'

రంజాన్ మాసంలో ముస్లింల దినచర్య సూర్యోదయానికి ముందే మొదలవుతుంది. తెల్లవారుజామున నిర్ణయించిన సమయంలో తీసుకునే ఆహారాన్ని 'సెహ్రి' అంటారు. ఆ తర్వాత సూర్యాస్తమయం వరకు మంచి నీరు కూడా తాగకుండా కఠినమైన దీక్షను పాటిస్తారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఖర్జూర పండుతో లేదా నీటితో ఉపవాసాన్ని విరమిస్తారు, దీనిని 'ఇఫ్తార్' అంటారు. ఈ ఇఫ్తార్ విందుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా కలిసి పాల్గొనడం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది.

తరావీహ్ ప్రార్థనలు - రాత్రిపూట ఆధ్యాత్మికత

రంజాన్ మాసంలో సాధారణంగా చేసే ఐదు పూటల నమాజ్‌తో పాటు, రాత్రి వేళల్లో 'తరావీహ్' అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మసీదులలో ఇమామ్‌లు ఖురాన్‌ను పఠిస్తుంటే భక్తులు శ్రద్ధగా వింటారు. ఈ నెల పూర్తయ్యేలోపు ఖురాన్ మొత్తాన్ని ఒక్కసారైనా పఠించడం లేదా వినడం అత్యంత పుణ్య కార్యంగా పరిగణించబడుతుంది. అందుకే మసీదులన్నీ ఈ నెలలో విద్యుత్ దీపాలతో, భక్తుల సందడితో కళకళలాడుతుంటాయి.

జకాత్, ఫిత్రా - మానవత్వానికి ప్రాధాన్యం

రంజాన్ అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, పేదవాడి ఆకలిని తీర్చడం కూడా. తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానం చేయడాన్ని 'జకాత్' అంటారు. అలాగే ఈద్ పండుగకు ముందు 'ఫిత్రా' అనే దానాన్ని ప్రతి ముస్లిం తప్పనిసరిగా చేయాలి. తన ఇంట్లో పండుగ సంబరాలు జరుపుకునే ముందు, సమాజంలో ఉన్న నిరుపేదలు కూడా కొత్త బట్టలు ధరించి, కడుపు నిండా భోజనం చేసేలా చూడటమే ఈ సంప్రదాయం వెనుక ఉన్న గొప్ప ఉద్దేశ్యం.

ఉపవాసం నుంచి ఎవరికి మినహాయింపు?

ఇస్లాం ధర్మం ప్రకారం ఉపవాసం అందరికీ నిర్బంధం కాదు. అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, ప్రయాణంలో ఉన్నవారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. భగవంతుడు మనుషులకు కష్టం కలిగించాలని కాకుండా, వారిలో క్రమశిక్షణను పెంపొందించడానికే ఈ దీక్షలను ఇచ్చాడని ముస్లింలు నమ్ముతారు. ఒకవేళ ఎవరైనా ఆరోగ్య కారణాల వల్ల ఉపవాసం ఉండలేకపోతే, వారు పేదలకు భోజనం పెట్టడం ద్వారా ఆ పుణ్యాన్ని పొందవచ్చు.

నెలవంక దర్శనం - పండుగ నిర్ణయం

ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుని గమనంపై ఆధారపడి ఉంటుంది. అందుకే రంజాన్ ప్రారంభం, ముగింపు రెండు కూడా నెలవంక కనిపించడం పైనే ఆధారపడి ఉంటాయి. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించిన మరుసటి రోజు సాధారణంగా భారత్‌లో కనిపిస్తుంది. ఒక నెలలో 29 లేదా 30 రోజులు ఉంటాయి. నెల చివరన షవ్వాల్ మాసపు నెలవంక కనిపించగానే 'ఈద్-ఉల్-ఫితర్' (రంజాన్ పండుగ) జరుపుకుంటారు.

ఇండొనేషియా నుంచి మొరాకో వరకు చాలా ముస్లిం దేశాలున్నాయి. అంటే నెలవంక ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో కనిపించే అవకాశం ఉంది.

"సంప్రదాయ పరంగా మక్కాలో నెలవంక కనిపించే సమయాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు". కొన్నిసార్లు పశ్చిమాసియా దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లో నెలవంకను వేర్వేరు రోజుల్లో కనిపిస్తుంది. పాశ్చాత్య క్యాలెండర్ కన్నా చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామిక్‌ క్యాలెండర్ 10 రోజులు తక్కువ ఉంటుంది. అంటే, ప్రతి సంవత్సరం రంజాన్ 10 రోజులు ముందుగా వస్తుంది.

ఈద్-ఉల్-ఫితర్: విజయానికి సంకేతం

నెల రోజుల కఠిన దీక్షలు విజయవంతంగా ముగిసినందుకు కృతజ్ఞతగా జరుపుకునే పండుగే ఈద్-ఉల్-ఫితర్. 'ఈద్' అంటే పండుగ, 'ఫితర్' అంటే ఉపవాసం విరమించడం. ఈ రోజున ముస్లింలు ఉదయాన్నే దర్గాలకు వెళ్లి సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని 'ఈద్ ముబారక్' అని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇంటికి వచ్చిన అతిథులకు 'షీర్ ఖుర్మా' (సేమియా పాయసం) వడ్డించడం ఈ పండుగ ప్రత్యేకత.

కాలం మారుతున్నా రంజాన్ పాటించే పద్ధతుల్లో భక్తి ఏ మాత్రం తగ్గలేదు. పూర్వం కేవలం కంటితోనే నెలవంకను చూసేవారు, ఇప్పుడు టెలిస్కోపులు, శాస్త్రీయ పద్ధతులను వాడుతున్నారు. అయితే, పండుగ ఇచ్చే సందేశం మాత్రం ఒక్కటే, అది శాంతి, సహనం. ఈ మాసంలో గల్ఫ్ దేశాల నుండి భారతదేశం వరకు ప్రతి చోటా ముస్లింలు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు.

రంజాన్ అంటే కేవలం ఉపవాసం, ప్రార్థనలు మాత్రమే కాదు. అది ఒక జీవన శైలి. మనిషి తనలోని అహంకారాన్ని చంపుకుని, దయను పెంపొందించుకోవాలని ఈ మాసం బోధిస్తుంది. కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందుల్లో అందరూ పాల్గొనడం భారతీయ సంస్కృతిలోని 'భిన్నత్వంలో ఏకత్వం'ను చాటిచెబుతుంది. ఈ పవిత్ర మాసం అందరి జీవితాల్లో సుఖశాంతులను నింపాలని ఆకాంక్షిద్దాం.