Let's talk: editor@tmv.in
రంగుల హరివిల్లు: హోలీ

రంగుల హరివిల్లు: హోలీ

Dantu Vijaya Lakshmi Prasanna
4 మార్చి, 2026

చిగురించిన ఆశలకి రంగులద్ది..* *వికసించిన స్నేహానికి స్వరాలు కూర్చి.. "వసంత కోకిల మోసుకొచ్చిన రంగుల పల్లకిలో.. ద్వేషం కరిగిపోవాలి, ప్రేమ దివ్వెలు వెలగాలి! ప్రతి మనసు ఆనందాల హోలీలో తడవాలి. హోలీ పండుగ సందర్భంగా రంగుల హేలీ హోలీ గురించి మరిన్ని విశేషాలు చూద్దాం…

వసంతం నెమ్మదిగా భారతావనిలో అడుగుపెడుతున్న రోజు ఇది. చలి చలిమంటలా కరిగిపోతూ, ఎండ వెచ్చదనంతో వేసవి భూమిని తాకుతున్న వేళ… గాలిలో ఏదో మార్పు. చెట్ల కొమ్మలపై కొత్త మొగ్గల పూల పరిమళం, పక్షుల కిలకిలలు..,కోయిల కొత్త రాగాలు .. ఆకాశంలో విరిసే రంగుల హరివిల్లు ఒక్కసారే భూమిమీదకు వచ్చినట్టు ..అన్నీ కలిసి ఒక ఉత్సవానికి ముచ్చటగా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తాయి. అదే హోలీ. ఇది కేవలం ఒక పండుగ కాదు, భారతదేశం అనే మహా కథలో ప్రతి సంవత్సరం పునరావృతమయ్యే రంగుల అధ్యాయం.

భారతదేశం అన్నా, ఇక్కడి పండుగలు అన్నా ఒక ప్రత్యేకమైన అనుభూతి. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశం యొక్క మూల సూత్రం. ఈ వైవిధ్యాన్ని ప్రతిబింబించే పండుగల్లో 'హోలీ' ప్రథమ స్థానంలో ఉంటుంది. ప్రకృతి వసంత రుతువులోకి అడుగుపెడుతున్న సమయాన, చెట్లు చిగురించి, పూలు విరిసే ఈ కాలంలో, మనుషుల మనసుల్లో కూడా కొత్త ఆశలు చిగురిస్తాయి. రంగుల పండుగగా పిలవబడే హోలీ, కేవలం రంగులు చల్లుకునే వేడుక మాత్రమే కాదు, అది సామాజిక ఐక్యతకు, ప్రేమకు, చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనం.

ఏ పండుగ వెనుకైనా ఒక పురాణ గాథ ఉంటుంది. హోలీ విషయంలో అయితే ఇది ఒక అద్భుతమైన సమ్మేళనం.

హోలికా దహనం - చెడుపై మంచి విజయం

భారతదేశంలో చాలా ప్రాంతాల్లో హోలీకి ముందు రోజు రాత్రి జరిగే 'హోలికా దహనం' మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తన కుమారుడైన ప్రహ్లాదుడిని చంపాలని పన్నాగం పన్నుతాడు. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడంతో, తండ్రి ఆగ్రహానికి గురవుతాడు. ప్రహ్లాదుడిని భస్మం చేయమని తన సోదరి హోలికకు చెప్తాడు. హోలికకు అగ్నిలో కాలకుండా ఉండే వరం ఉంటుంది. కానీ, హోలిక ప్రహ్లాదుడిని చంపాలనే ప్రయత్నంలో మంటల్లో కాలిపోగా, భగవంతుని ఆశీస్సులతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. ఇది 'చెడు ఎంత శక్తివంతమైనదైనా, చివరికి మంచే గెలుస్తుంది' అనే సత్యాన్ని చాటిచెబుతుంది.

ఈ వేడుకలో భాగంగా, గ్రామాల్లో పట్టణాలలో సాయంత్రం అవుతుండగానే పిల్లలు, పెద్దలు ఒకచోట చేరి మంట సిద్ధం చేస్తారు. చీకటి కమ్ముకొస్తున్న వేళ అగ్ని వెలుగులు చుట్టూ నర్తిస్తాయి. అది హోలిక దహన్ రాత్రి. ఈ మంటల్లో కేవలం కట్టెలే కాదు, మనసుల్లోని అహంకారం, అసూయ, ద్వేషం కూడా దహనమవుతుందని ప్రజలు నమ్ముతారు. ఆ మంట నిశబ్ధంగా ఒక కథ చెబుతుంది, ప్రహ్లాదుడి భక్తిని. అహంకారంతో అగ్నిలా మండిన హిరణ్యకశిపుడి గర్వాన్ని, వరం ఉన్నా నాశనమయ్యే హోళీకా అహంకారాన్ని, చెడుపై మంచి ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకాన్ని..

మరుసటి రోజు సూర్యుడు ఉదయించగానే ఊళ్లు మారిపోతాయి. తెల్లటి దుస్తులు వేసుకున్న మనుషులు క్షణాల్లోనే రంగుల కాన్వాస్‌లుగా మారతారు. ఎక్కడ చూసినా నవ్వులు, అరుపులు, పాటలు. “బురా నా మానో, హోలీ హై” అన్న మాటలు గాలిలో తేలుతూ పాత విభేదాలను కడిగేస్తాయి. చిన్న పిల్లలు నీళ్లతో నిండిన పిచికారీలతో వీధుల్లో పరుగులు పెడతారు. పెద్దలు కూడా చిన్నలవుతారు. ఆ రోజు వయసు, హోదా, సంపద, ఏదీ ముఖ్యం కాదు. అందరిదీ ఒకటే భాష. ఒకటే మతం.. అదే రంగుల భాష ,ఆనందం అనే మతం..

రాధాకృష్ణుల లీల

ఉత్తర భారతంలో, ముఖ్యంగా మధుర, బృందావన ప్రాంతాలలో హోలీని రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు తన చర్మపు రంగు నీలంగా ఉన్నందుకు, రాధా దేవిని చూసి, 'నా రంగు ఇలా ఎందుకు ఉంది?' అని యశోదమ్మను అడిగేవాడట. అప్పుడు ఆమె, 'నీకు నచ్చిన రంగును రాధ ముఖంపై పూయిస్తే, ఆమె కూడా నీ రంగులోనే కనిపిస్తుంది కదా!' అని సూచిస్తుంది. ఆ నాటి నుండి శ్రీకృష్ణుడు రాధపై రంగులు చల్లడం, వేడుకలు చేసుకోవడం ఒక ఆనవాయితీగా మారిందట.అప్పటి నుండి అక్కడ హోలీ పండుగ ఒక రోజు పండుగలా కాకుండా వారాలపాటు సాగే ఉత్సవంలా మారింది. ఇప్పటికీ అక్కడ సంగీతం, నృత్యం, కీర్తనలు, భజనలు ఇలా అన్నీ కలిసి ఒక మహోత్సవంగా మారతాయి. రంగులు కేవలం ఆనందానికి కాదు భగవంతుడితో భక్తుడి అనుబంధానికి సంకేతంగా వారు భావిస్తారు.

కామదేవుని త్యాగం

దక్షిణ భారతంలో, ముఖ్యంగా తమిళనాడులో, హోలీకి మన్మథుడి (కామదేవుడు) కథ ముడిపడి ఉంది. లోక రక్షణకై శివ పార్వతుల కళ్యాణం కోసం తపస్సులో ఉన్న శివునికి ప్రేమ భాణాలతో తపోభంగం కలిగించడానికి మన్మథుడు ప్రయత్నించగా, శివుడు ఆగ్రహించి తన మూడవ కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు. అనతరం రతీదేవి రోధనతో, పార్వతీ దేవి కోరిక మేరకు శివుడు మన్మథుడిని తిరిగి బ్రతికిస్తాడు. ఈ సంఘటన భక్తి, త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుంది. అందుకే హోలిరోజున కామదేవుని దహన వేడుకలు జరుపుకుంటార

సామాజిక ఐక్యతకు ప్రతీక

నేటి ఆధునిక కాలంలో, టెక్నాలజీ పెరుగుతున్నా, హోలీ లాంటి పండుగలు మనుషులను ఒకచోట చేరుస్తున్నాయి. కుల, మత, ప్రాంతీయ భేదాలను పక్కన పెట్టి, అందరూ రంగుల్లో కలిసిపోయినప్పుడు, ఏది ఏ రంగు అనేది తెలియదు. ఇది సామాజిక సామరస్యానికి అతిపెద్ద ఉదాహరణ.

దేశమంతా ఒకే రంగుల పండుగను జరుపుకున్నా, ప్రాంతాన్ని బట్టి ఆచారాలు మారుతూ పండుగకు కొత్త శోభను ఇస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని బర్సానాలో మహిళలు పురుషులను కర్రలతో సరదాగా కొట్టే 'లత్మార్ హోలీ' వింతగా అనిపిస్తే, బృందావనంలో భక్తిశ్రద్ధలతో రంగులకు బదులు పరిమళభరితమైన తాజా పూలతో 'పూల హోలీ' ఆడుకుంటారు. హర్యానాలో ధులాండీ పేరుతో బావ-మరదళ్ల మధ్య సాగే అల్లరి, ఆటపాటలు ఇక్కడి హోలీ పండుగకు ప్రధాన ఆకర్షణ.

మహారాష్ట్ర, గోవాల్లో 'రంగ పంచమి' (హోలీ) నాడు యువకులు మానవ పిరమిడ్లుగా ఏర్పడి ఎత్తులో ఉన్న పెరుగు కుండలను (మట్కా) పగలగొట్టి శ్రీకృష్ణుడి లీలలను స్మరించుకుంటారు. పశ్చిమ బెంగాల్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వంగా 'వసంతోత్సవం' పేరుతో పసుపు వస్త్రాలు ధరించి శాంతినికేతన్‌లో సాంస్కృతిక నృత్యాలతో ప్రకృతిని ఆరాధిస్తారు.

ఒకప్పుడు రాజపుత్రుల పాలనలో ఉన్న రాజస్థాన్‌లో ‘రాజసం హోలీ' అత్యంత వైభవంగా జరుగుతుంది. ఏనుగుల ఊరేగింపులు, రాజ దర్బార్ తరహా వేడుకలు, సాంప్రదాయ సంగీతం పండుగకు ఒక రాయల్ లుక్ ఇస్తే, హర్యానాలో 'ధులాండీ' పేరుతో బావ-మరదళ్ల మధ్య సాగే అల్లరి చేష్టలు నవ్వులు పూయిస్తాయి.

ఇక బీహార్‌లో 'ఫాల్గుణ పూర్ణిమ' నాడు పంటలు చేతికి వచ్చే వేళ, జానపద గీతాలు పాడుతూ బురద రంగులతో ప్రకృతితో మమేకమవుతూ ఆనందాన్ని పంచుకుంటారు. తమిళనాడు (కామన్ పండిగై) పేరుతో ఈ పండుగలో మన్మథుడికి పూజలు చేస్తారు. గంధం పూతతో కూడిన ఆచారాలు, భక్తి గీతాలు ఇక్కడ వినిపిస్తాయి

మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హోలీ వేడుకలు ఉత్తర భారతదేశంతో పోలిస్తే శాంతంగా, కుటుంబ వాతావరణంలో జరుగుతాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో యువత రంగులతో, నీటి పిచికారీలతో ఒకరిమీద ఒకరు రంగులు వేసుకుంటూ ఉత్సాహంగా హోలీ జరుపుకుంటే, గ్రామాల్లో హోలిక దహన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇళ్లలో దేవతలకు పూజలు చేసి, పెద్దలకు గౌరవంగా నమస్కరించి, స్నేహితులతో రంగులు పూసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో హోలీని “కామదహనం”గా భావించి, మన్మథుడి దహన గాధను స్మరిస్తూ ఆచారాలు నిర్వహిస్తారు. తీపి వంటకాలు పంచుకుంటూ, పరస్పర శుభాకాంక్షలు చెప్పుకోవడం తెలుగు రాష్ట్రాల హోలీ ప్రత్యేకత.

ఇలా ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో హోలీని జరుపుకుంటూ భారతీయ సంస్కృతిలోని భిన్నత్వాన్ని చాటిచెబుతుంది.

అంతేకాదు ఇళ్లలో వంటగదులు కూడా పండుగలో భాగమవుతాయి. గుజియా వాసన, మాల్పువా తీపి, దహి వడ చల్లదనం, థండాయి రుచి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి భోజనం చేస్తారు. మాటలు, నవ్వులు, జ్ఞాపకాలు అన్నీ కలిసే హోలీ ఒక ప్రత్యేక వేడుక. అలాగే ఎక్కడో ఒక మూల “రంగ్ బర్సే” పాట వినిపిస్తుంది. ఇంకెక్కడో జానపద హోలీ పాటలు. డప్పుల శబ్దం, చప్పట్ల తాళం, పిల్లల కేరింతలు, పెద్దల నృత్యాలతో హోలీకి సంగీతం ఊపిరి అన్నట్టు ఉంటుంది.

కాలం మారినా హోలీ ఆత్మ మారలేదు

నేటి కాలంలో హోలీకి కొత్త ఆలోచనలు వచ్చాయి. సహజ రంగులు, నీటి పొదుపు, పర్యావరణంపై శ్రద్ధ. కానీ పండుగ ఆత్మ అదే.. ప్రేమ, క్షమ, సమానత్వం. పండుగ తరువాత రంగులు కరిగిపోతాయి. కానీ ఆ రోజు పంచుకున్న నవ్వులు, ఆలింగనాలు, మన్నింపులు మనసుల్లో నిలిచిపోతాయి.

హోలీ ఒక రోజు పండుగ మాత్రమే కాదు. అది జీవితం ఎలా ఉండాలో చెప్పే కథ. హోలీ చెడును దహనం చేసి, మంచిని ఆహ్వానించమని చెబుతుంది. ద్వేషాన్ని వదిలి, ప్రేమను పంచుకోమని చెబుతుంది. రంగుల్లా మన జీవితాల్లో కూడా ఎన్నో భావాలు ఉంటాయని, వాటన్నింటినీ అంగీకరించడమే నిజమైన ఆనందమని గుర్తుచేస్తుంది.

2026లో కూడా, మనం అదే ఉత్సాహంతో హోలీని జరుపుకుంటూ, మన సంస్కృతిని, విలువలను వచ్చే తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.

ఈ రంగుల పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగులను, ఆనందాలను, ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుందాం. పాత కోపతాపాలను మర్చిపోయి, ఒకరికొకరు రంగులు పులుముకుంటూ ఆత్మీయతను పంచుకుందాం.

హోలీ అంటే కేవలం రంగులతో నిండిన రోజు కాదు, అది మన హృదయాలను శుభ్రం చేసుకునే రోజు. మనలోని చెడును వదిలేసి, మంచిని స్వీకరించే రోజు. ఈ వసంత కాలంలో మీ జీవితం కూడా రంగులమయం కావాలని, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ హోలీ శుభాకాంక్షలు!