
రంగారెడ్డి జిల్లాలో నాగిరెడ్డి కుంటకు హైడ్రా విముక్తి.. 8.24 ఎకరాలు స్వాధీనం
నగరం నలుమూలలా మంగళవారం హైడ్రా అధికారులు విస్తృత స్థాయిలో ఆపరేషన్లు నిర్వహించి పలు కీలక ఆక్రమణలను తొలగించారు. చెరువులు, పార్కులు, రహదారులు వంటి ప్రజా అవసరాలకు సంబంధించిన భూములను రక్షించడంలో భాగంగా చేపట్టిన ఈ చర్యలకు స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో ఏకంగా 8.24 ఎకరాల విస్తీర్ణం కలిగిన 'నాగిరెడ్డి కుంట'ను కబ్జా చేసేందుకు బడా నిర్మాణ సంస్థలు వేసిన పథకాన్ని హైడ్రా అడ్డుకుంది. రెవెన్యూ రికార్డుల్లో చెరువుగా ఉన్న ఈ స్థలాన్ని కనబడకుండా చేసేందుకు 20 అడుగుల ఎత్తులో టిన్ షీట్లతో ప్రహరీ నిర్మించి, లోపల రహస్యంగా ప్లాట్లుగా మార్చారు. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ 4 ఎకరాలు, మరో సంస్థ 3 ఎకరాలు ఆక్రమించగా, ఒక మాజీ ప్రజాప్రతినిధి కూడా ఎకరానికి పైగా కబ్జా చేసి విక్రయించినట్లు విచారణలో తేలింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా, అక్కడ నిర్మించిన తాత్కాలిక గదులు, ప్రహరీలను కూల్చివేసి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసింది.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా దుండిగల్ – గండిమైసమ్మ మండలం బౌరంపేట పరిధిలో 150 అడుగుల ప్రధాన రహదారిని ఆక్రమించి నిర్మించిన 10 షెడ్లను హైడ్రా కూల్చివేసింది. గండిమైసమ్మ–మియాపూర్ రహదారిపై స్క్రాప్ ఇతర దుకాణాలను అక్రమంగా నిర్మించి అద్దెకు ఇస్తుండటంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రెండు నెలల ముందే నోటీసులు ఇచ్చిన అధికారులు, మంగళవారం వాటిని పూర్తిగా తొలగించి రహదారిని విముక్తి చేశారు. దీంతో స్థానిక వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఇక ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 68లో 1987లో వేసిన లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించిన 1440 గజాల స్థలాన్ని కబ్జాదారులు ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ప్రయత్నించారు. 'ప్రజావాణి'లో అందిన ఫిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా, విక్రయాలు జరుగుతున్న సమయంలోనే అడ్డుకుని, ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. అక్కడ పార్కు స్థలమంటూ బోర్డులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేసింది. నగర సంపదను కాపాడటంలో హైడ్రా చూపుతున్న వేగం పట్ల సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ఏమాత్రం ఆలస్యమైనా ఈ విలువైన భూముల్లో శాశ్వత నిర్మాణాలు వచ్చేసేవని స్థానికులు పేర్కొన్నారు.
