
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మిర్జగూడ గ్రామం సమీపంలో సోమవారం ఉదయం సుమారుగా 6:30 నుంచి 7:30 మధ్య సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్–బీజాపూర్ హైవేపై టీఎస్‌ఆర్టీసీ బస్సు కంకరతో నిండిన టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.బస్సు డ్రైవర్,టిప్పర్ లారీ డ్రైవర్ కూడా ఈ ఘటనా సమయంలో మృతి చెందారు.
పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం, ఆ బస్సులో సుమారు 70 నుంచి 72 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి తాండూర్ వైపు వెళ్తుండగా, ఎదురు దిశనుంచి అధిక వేగంతో వచ్చిన టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టింది. ఢీకొన్నడం వల్ల లారీ లోని కంకర బస్సులోకి దూసుకెళ్లి, ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతతో బస్సు ముందు భాగం పూర్తిగా నలిగిపోయింది.
రక్షణ సిబ్బంది, పోలీసులు, స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చెవెళ్ల, షాద్నగర్, హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు తరలించారు. జేసీబీల సాయంతో మిగిలిన ప్రయాణికులను బస్సు శకలాల నుంచి బయటకు తీశారు.ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ నిర్లక్ష్యమేనా, లేక మెకానికల్ లోపమా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.ఈ దారుణ ఘటన రహదారి భద్రతా ప్రమాణాలపై, భారీ వాహనాల నియంత్రణపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తింది.
ఒకే కుటుంబంలో అక్కాచెల్లెళ్లు అంతులేని విషాదం
రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ఈ ప్రమాదంలో మృతిచెందారు. అక్కాచెల్లెళ్లు తనూష, సాయి ప్రియ, నందిని మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో చదువుతున్న ముగ్గురూ గత నెల 15న జరిగిన ఓ పెళ్లివేడుకలో సందడిగా గడిపారు. తల్లిదండ్రులతో పాటు బంధువులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఎల్లయ్యగౌడ్ డ్రైవర్‌గా పనిచేస్తూ పిల్లల్ని చదివించారు. ఆయనకు నలుగురు కుమార్తెలు. ఒక కుమార్తెకు వివాహం కాగా మిగిలిన ముగ్గురు కుమార్తెలు సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఈ ఘలనపై బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచి వేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ప్రమాద ఘటనా స్థలంలో దృశ్యాలు బాధ కలిగించాయని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన పరిహారంతో పాటు అన్ని రకాలుగా సాయం అందింస్తుందని తెలిపారు. ప్రమాదాలు జరిగినపుడు ఆర్టీసీ తరపున అందించే బీమాతో పాటు బాధిత కుటుంబాలకు భరోసా నిచ్చే చర్యలు వేగంగా చేపట్టాలని సూచించారు.
మృతి చెందిన వారి కుటుంబాలకు 5లక్షల పరిహారం
ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాల పై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తో, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. చేవెళ్ళే బస్సు ప్రమాదంలో మృతుల పట్ల నా ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ఆకాంక్షిస్తున్నాను.ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు,ఆర్టీసీ నుంచి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు.
బస్సు ప్రమాద బాధితులకు పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ లో పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెలుసుకోవడం తెలుసుకున్నారు. బస్సు ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన మృతదేహాలకు చేవెళ్ళే ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహణ పై అధికారులతో మాట్లాడారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేస్తూ, మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సాయం ప్రకటించారు.
ఈ బస్సు ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఎందరో నిండు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరమని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్,ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రగాఢ సానుభూతి తెలిపారు.
