
రంగారెడ్డిలో కుక్కలపై క్రూరత్వం.. వంద మృతి?
గ్రామాల్లో కుక్కలు కనిపిస్తే చాలు… కొందరు మనుషులు కర్కశంగా మారుతున్నారు. కరవకముందే, అరవకముందే వీధి కుక్కలపై విషప్రయోగం చేసి నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో గెలిచిన అభ్యర్థులు ‘ఊర్లో నుంచి కుక్కలను తరిమేస్తాం’ అంటూ ఇచ్చిన హామీలే ఈ అమానుష చర్యలకు కారణంగా మారినట్టు తెలుస్తోంది. ఫలితంగా గ్రామాల వారీగా వందలకు పైగా కుక్కలు విషప్రయోగానికి బలవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కలపై క్రూరత్వం కొనసాగుతోంది.తాజాగా హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో దాదాపు 100 వీధి కుక్కలను విషమిచ్చి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో యాచారం గ్రామపంచాయతీ సర్పంచ్‌తో పాటు గ్రామ కార్యదర్శి, ఒక వార్డు సభ్యుడిపై పోలీసులు కేసులు పెట్టారు.
స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక జంతు సంక్షేమ కార్యకర్త యాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జనవరి 19న వీధి కుక్కలకు విషపూరిత పదార్థాలను ఇంజెక్షన్ల రూపంలో ఇచ్చి చంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై భారతీయ న్యాయ సంహిత, జంతు క్రూరత్వ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తు చేస్తున్నాం
ఫిర్యాదుదారుడు సుమారు 100 కుక్కలు మృతి చెందినట్లు పేర్కొనగా, ప్రాథమిక విచారణలో గ్రామస్తులను ప్రశ్నించి పరిశీలించిన తర్వాత సుమారు 50 కుక్కలు చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చామని పోలీసులు తెలిపారు. అయితే, మరింత దర్యాప్తు కొనసాగుతోందని, మృత కుక్కల కళేబరాలను గుర్తించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు.
ఇదే తరహాలో, హనుమకొండ జిల్లాలోని శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో సుమారు 300 వీధి కుక్కలను చంపిన ఘటనలో ఇద్దరు మహిళా సర్పంచులు, వారి భర్తలు సహా మొత్తం 9 మందిపై కేసులు నమోదయ్యాయి. అలాగే కామారెడ్డి జిల్లాలో సుమారు 200 వీధి కుక్కలను హతమార్చిన ఘటనలో 5 మంది సర్పంచులతో సహా ఆరుగురిపై కేసులు నమోదు చేశారు.
జనవరి 6 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో వివిధ జిల్లాల్లో దాదాపు 500 వీధి కుక్కలు హతమయ్యాయని సమాచారం. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, వీధి కుక్కల సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్తులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కొందరు ప్రజాప్రతినిధులు ఈ చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
