
యెడ్యూరప్పపై ‘పోక్సో’రద్దు చేయలేం: కర్ణాటక హైకోర్టు
మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యెడ్యూరప్పపై నమోదైన పోక్సో కేసు రద్దు చేయాలన్న అభ్యర్థనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 28న తీసుకున్న కాగ్నిజెన్స్ ఆర్డర్(ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అని పరిశీలించి, ఆ కేసును తదుపరి విచారణకు స్వీకరించే నిర్ణయం తీసుకోవడం)ను అలాగే ఉంచుతూ న్యాయమూర్తి ఎం.ఐ. అరుణ్ తీర్పు ఇచ్చారు. అయితే విచారణ సమయంలో యెడ్యూరప్ప వ్యక్తిగత హాజరు తప్పనిసరి కాదని, అవసరం ఉన్నప్పుడు మాత్రమే హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. ఆయన తరఫున దాఖలు చేసే మినహాయింపు పిటిషన్‌లను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఆదేశించింది. అదే సమయంలో, ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ కోసం యెడ్యూరప్ప ప్రయత్నించవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది.
ఈ కేసు నేపథ్యం ఇలా ఉంది
బెంగళూరులోని తన నివాసంలో 2024 ఫిబ్రవరిలో 17 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారంటూ ఆ బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. సదాశివనగర్ పోలీసులు మార్చి 14న కేసు నమోదు చేసి, తర్వాత దానిని సీఐడీకి బదిలీ చేశారు. సీఐడీ తిరిగి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, మాజీ సీఎంపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
యెడ్యూరప్ప తరఫున సీనియర్ అడ్వకేట్ సి.వి. నాగేశ్ వాదిస్తూ, ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని, ఫిర్యాదులో విశ్వసనీయత లేదని చెప్పారు. ఫిబ్రవరి నెలలో బాధితురాలు, ఆమె తల్లి పలుమార్లు పోలీసు కమిషనర్‌ను కలిసినా ఒక్కసారి కూడా ఆరోపణల గురించి చెప్పలేదని గుర్తుచేశారు. సాక్షుల ప్రకటనల్లో కూడా ఎలాంటి అసాంఘిక ఘటన జరగలేదని తెలిపారు. ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రొఫెసర్ రవివర్మ కుమార్ వాదిస్తూ, ట్రయల్ కోర్టు బాధితురాలి స్టేట్‌మెంట్‌తో సహా అన్ని ఆధారాలు పరిశీలించి మాత్రమే కాగ్నిజెన్స్ తీసుకుందని చెప్పారు. ఆ ఆర్డర్‌లో సరైన న్యాయపరమైన ఆలోచన ప్రతిబింబిస్తోందని వాదించారు.
