
యూసఫ్ గూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటింటి ప్రచారం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నెలకొన్న అభివృద్ధి సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రజల కోసం ఎటువంటి అభివృద్ధి చర్యలు చేపట్టలేదని మంత్రి విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఎప్పుడూ గెలవలేదు.ఈ ప్రాంతం కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆధీనంలో ఉండగా,ఆ తరువాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ కాలంలో కూడా అభివృద్ధి అనే పదమే కనబడలేదు. ఇక్కడ కాలువలు పొంగిపొర్లుతున్నాయి, రోడ్లపై డ్రెయినేజ్ నీరు ప్రవహిస్తోంది, తాగునీటిలో కలుషిత నీరు కలుస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే వర్షాకాలంలో రోడ్లు నదుల్లా మారిపోతున్నాయి. ఇళ్లలోకే నీరు చొరబడుతోంది. వీధి దీపాలు పనిచేయడం లేదు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల పాలనతో విసిగిపోయారు. ఇకపై ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు అని మంత్రి పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి సాధ్యమయ్యేది కేవలం బీజేపీ ద్వారానేనని కిషన్ రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీని గెలిపించండి. అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయి. ప్రజల మద్దతుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ప్రజలకు వివరించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉపఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ పోటీ చేస్తుండగా, బీఆర్‌ఎస్ పార్టీ గోపీనాథ్ భార్య సునీతను అభ్యర్థిగా నిలబెట్టింది. బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.
