Let's talk: editor@tmv.in
యూరియా వాడకం తగ్గించండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

యూరియా వాడకం తగ్గించండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Gaddamidi Naveen
8 ఏప్రిల్, 2026

తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం, ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ‘రైతునేస్తం’ కార్యక్రమం ఈ వారం కూడా ఉత్సాహంగా జరిగింది. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వివిధ జిల్లాల రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. రైతునేస్తం వేదికగా మంత్రి వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతికత వినియోగంపై రైతులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ పనితీరుపై మంత్రి రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఇంట్లో కూర్చునే బుక్ చేసుకుంటున్నామని రైతులు హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, వీలున్నప్పుడు యూరియాను తెచ్చుకునే సౌలభ్యం కలిగిందని వారు కొనియాడారు.

అధిక యూరియా వినియోగం వల్ల కలిగే నష్టాలపై మంత్రి రైతులకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అధిక యూరియా వినియోగం ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. యూరియాను అధికంగా వాడటం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతిని, కాలక్రమేణా దిగుబడులు తగ్గిపోతాయని, చీడపీడల సమస్యలు పెరుగుతాయని ఆయ‌న హెచ్చరించారు. కాబట్టి సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం పంట కోతల సమయం కావడంతో, కోతల అనంతరం మిగిలిన పంట వ్యర్థాలను కాల్చవద్దని మంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణం కలుషితం అవ్వడమే కాకుండా, భూమిలోని మిత్ర పురుగులు చనిపోయి నేల నిస్సారమవుతుందని హెచ్చరించారు.

అదనంగా రైతులు పామాయిల్ పంటను కూడా సాగులోకి తీసుకురావాలని మంత్రి ప్రోత్సహించారు. పామాయిల్‌తో పాటు వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలను కూడా సాగు చేయవచ్చని వివరించారు. పామాయిల్ సాగు ద్వారా రైతులకు స్థిరమైన, అధిక ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రైతునేస్తం కార్యక్రమంలో రైతులు మరింత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.