
యూరియా పంపిణీలో పారదర్శకత ఉండాల్సిందే: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండల కేంద్రంలోని రైతు ఆగ్రోస్–2 కేంద్రంలో యూరియా ఎరువుల నిల్వలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తోకలిసి పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత, సరఫరా పరిస్థితులపై ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న యూరియా ఎరువుల మొత్తం నిల్వల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, స్టాక్ రిజిస్టర్‌ను స్వయంగా పరిశీలించారు. గ్రామాల వారీగా ఎరువుల సరఫరా ఎలా జరుగుతోందన్న అంశంపై పూర్తి సమాచారం సేకరించారు. యూరియా పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు.
అనంతరం కేంద్రానికి వచ్చిన రైతులతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నేరుగా మాట్లాడారు. యూరియా లభ్యత, ధరలు, సరఫరాలో జాప్యం, దళారుల జోక్యం వంటి అంశాలపై రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కీలక దశలో ఉన్నందున ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూరియా కొరతను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించడం, బ్లాక్ మార్కెటింగ్ వంటి అక్రమ చర్యలు జరిగితే వాటిపై బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ప్రశ్నిస్తామని ఆయన తెలిపారు.
అలాగే రైతు ఆగ్రోస్ కేంద్రాల్లో ఎరువుల స్టాక్ వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలనీ, పంపిణీలో పూర్తిస్థాయి పారదర్శకత పాటించాలనీ అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా ఎరువుల సరఫరా నిరంతరంగా సాగాలని, ప్రతి రైతుకూ సమానంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రైతుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని, రైతు ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, యూరియా వస్తుందో లేదన్న ఆందోళనతో రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. యాప్ ఆధారంగా యూరియా పంపిణీ జరుగుతుండటంతో అనేక గ్రామాల్లో రైతులు ఆగమాగం అవుతున్న పరిస్థితి నెలకొందని. సాంకేతిక సమస్యలు, నెట్‌వర్క్ లోపాల కారణంగా యాప్ పనిచేయకపోవడంతో అవసరమైన సమయంలో ఎరువులు అందడం లేదని రైతులు వాపోతున్నారు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
యాప్ లేకుండా యూరియా పంపిణీ చేయాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా యాప్ విధానాన్ని బలవంతంగా అమలు చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు. అదేవిధంగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాట్ల కీలక సమయంలో రోజుకు కేవలం 8 గంటల విద్యుత్ మాత్రమే అందుతుండటంతో వ్యవసాయ పనులు సకాలంలో పూర్తి కావడం లేదని తెలిపారు. ఇక మరోవైపు రైతులు పండించిన ధాన్యాన్ని ఇప్పటికీ అన్‌లోడ్ చేయకుండా ఆలస్యం చేయడంతో సమస్యలు మరింత పెరిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
