Let's talk: editor@tmv.in
యూరప్ ఎల్‌ఎఫ్‌ఎల్‌లో తొలి భారత విజయం

యూరప్ ఎల్‌ఎఫ్‌ఎల్‌లో తొలి భారత విజయం

Koripelli Aditya
4 నవంబర్, 2025

భారత్ దిగ్గజ రెజ్లర్, ఎమ్ఎమ్ఏ ఫైటర్, కామన్వెల్త్ హెవీవెయిట్ ఛాంపియన్ సంగ్రామ్ సింగ్ మరోసారి చరిత్ర సృష్టించాడు. యూరప్‌లోని ప్రతిష్ఠాత్మక లెవెల్స్ ఫైట్ లీగ్ (ఎల్‌ఎఫ్‌ఎల్)లో గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు నమోదు చేశాడు.

ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ఎల్‌ఎఫ్‌ఎల్ 20వ ఈవెంట్‌లో ట్యునీషియాకు చెందిన హకీమ్ ట్రాబెల్సీని ఎదుర్కొన్న సంగ్రామ్, చాలా యువకుడైన స్ట్రైకర్-రెజ్లర్‌ను ఆధిపత్యంతో చిత్తు చేశాడు. ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రెస్ రిలీజ్ ప్రకారం, వ్యూహాత్మక ప్రదర్శనతో సంగ్రామ్ ఘన విజయం సాధించాడు.

పోరు మొదలైన వెంటనే సంగ్రామ్ తన అద్భుతమైన రెజ్లింగ్ నైపుణ్యంతో ఆధిపత్యం ప్రదర్శించాడు. ట్రాబెల్సీ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టి, క్లించ్, బాడీలాక్ పొజిషన్లలో నియంత్రణ కొనసాగించాడు. ప్రశాంతంగా ఉంటూ ఆపోనెంట్ దాడులకు ఆహ్వానం పలికి, కౌంటర్లతో ప్రతిఘటన చేశాడు.

రెండో రౌండ్‌లో సంగ్రామ్ అనుభవం, టెక్నికల్ నైపుణ్యం ప్రతిబింబించాయి. పర్ఫెక్ట్ బార్-ఆర్మ్ చోక్ సబ్‌మిషన్‌తో ట్రాబెల్సీని ట్యాప్ అవుట్ చేయించాడు. ఈ నిర్ణయాత్మక ఫినిష్ సంగ్రామ్ ఫైట్ ఐక్యూ, మానసిక దృఢత్వాన్ని చాటింది.

యూరప్‌లో సంగ్రామ్ సింగ్ రెండో పెద్ద ఎమ్ఎమ్ఏ విజయం ఇది. గతంలో జార్జియాలోని టిబిలిసి గామా ఇంటర్నేషనల్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్ ఫైటర్ అలీ రజా నసీర్‌ను 90 సెకన్లలోపే ఓడించి ప్రొఫెషనల్ డెబ్యూ సంచలనం సృష్టించాడు.

40 ఏళ్లు దాటినా సంగ్రామ్ సింగ్ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, అంకితభావంతో నిజమైన ఛాంపియన్‌న అని నిరూపిస్తున్నాడు. ఆమ్‌స్టర్‌డామ్ విజయం భారత ఎమ్ఎమ్ఏ ప్రపంచ వేదికపై మరో అద్భుత అధ్యాయం. కామన్వెల్త్ హెవీవెయిట్ ఛాంపియన్, ఎల్‌ఎఫ్‌ఎల్ విజేత సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ విజయం ప్రపంచ వేదిక పై పోటీ పడాలని కలలు కనే ప్రతి యువ భారతీయుడిది. ఎల్‌ఎఫ్‌ఎల్ యూరప్‌లో భారత ధైర్యం, స్థైర్యాన్ని చూపించే వేదిక ఇచ్చింది. నా ప్రయాణం అంకితభావం, ధైర్యంతో కలలు సాధించమని చాలామందిని ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాను.’

కోచ్ భూపేష్ కుమార్, ‘సంగ్రామ్‌‌ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. హకీమ్ ట్రాబెల్సీ వంటి ఆపోనెంట్‌ల ముందు బలంగా నిలబడి పోరాడాడు. అవసరమైనప్పుడు డిఫెన్సివ్‌గా, రెజ్లింగ్ నైపుణ్యంతో పూర్తి నియంత్రణలో ఉంచాడు. సంగ్రామ్ ఫైటింగ్ స్టైల్, ఓర్పు, బలం, తీక్ష్ణ స్ట్రాటజీల కలయిక, ఈ మ్యాచ్‌లో పూర్తిగా కనిపించింది. అద్భుతమైన పోరు, మంచి విజయం.’

ఎల్‌ఎఫ్‌ఎల్ అధ్యక్షుడు డొనోవన్ జేమ్స్ అలెగ్జాండర్ పనయోటిస్, ‘సంగ్రామ్ క్రీడా ప్రపంచానికి స్ఫూర్తి. ఎల్‌ఎఫ్‌ఎల్‌లో ఆయన ఉనికి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఆయన ఉత్సాహం, వినయం, అచంచలమైన ఆత్మ భారత క్రీడాభివృద్ధికి ఆదర్శ ప్రతినిధి.’ ఎల్‌ఎఫ్‌ఎల్ అధికారులు సంగ్రామ్ సింగ్‌ను ధైర్యం, సంకల్పానికి చిహ్నంగా కొనియాడారు. భారత ఎమ్ఎమ్ఏ చరిత్రలో మైలురాయిగా ఈ విజయాన్ని పేర్కొన్నారు.

యూరప్ ఎల్‌ఎఫ్‌ఎల్‌లో తొలి భారత విజయం - Tholi Paluku