Let's talk: editor@tmv.in
యూపీ విద్యాసంస్థల్లో తమిళంలోనూ తరగతులు

యూపీ విద్యాసంస్థల్లో తమిళంలోనూ తరగతులు

Pinjari Chand
12 జనవరి, 2026

సాంస్కృతిక, భాషా పరమైన పరస్పర మార్పిడిని మరింత బలపరచే దిశగా, వారణాసిలోని పాఠశాలలు, కళాశాలల్లో నియమితంగా తమిళ భాషా తరగతులు ప్రారంభించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన ‘కాశీ తమిళ సంగమం’ దృష్టికోణానికి అనుగుణంగా చేపడుతున్నదని పేర్కొన్నారు. డిసెంబర్ 28న ప్రసారమైన తన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో, తక్కువ కాలంలో తమిళం నేర్చుకున్న గవర్నమెంట్ క్వీన్స్ కాలేజీ విద్యార్థిని పాయల్ పటేల్‌ గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాని ఆలోచనలకు ప్రేరణ పొందిన వారణాసిలోని గవర్నమెంట్ క్వీన్స్ కాలేజీ ప్రతిరోజూ సాయంత్రం తమిళ భాషా తరగతులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డిస్ట్రిక్ట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్) కళాశాలకి ఆదేశాలు జారీ చేసినట్లు కాలేజీ ప్రిన్సిపాల్ సుమిత్ కుమార్ తెలిపారు. సాంస్కృతిక సమైక్యతపై ప్రధాని దృష్టిని దృష్టిలో పెట్టుకుని, మా కాలేజీలో తమిళ భాషా తరగతులు ప్రారంభిస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇంతకుముందు పాయల్ పటేల్‌కు తమిళం బోధించిన తమిళనాడుకు చెందిన సంధ్య కుమార్ సాయితో ఇప్పటికే చర్చలు జరిపామని, ఆమె ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహించేందుకు అంగీకరించిందని ఆయన చెప్పారు. అలాగే బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్యూ)లోని తమిళ విభాగాధిపతి కూడా ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

హిందీ నేర్పేందుకు తమిళనాడుకు

అధికారుల సమాచారం ప్రకారం, వారణాసి కమిషనర్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో, వారణాసి నుంచి 50 మంది ఉపాధ్యాయులను తమిళనాడుకు పంపే ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. ఇటీవల గవర్నమెంట్ క్వీన్స్ కాలేజీ విద్యార్థులు తమిళంలో నూతన సంవత్సర శుభాకాంక్షలను ప్రధాని నరేంద్ర మోడీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పంపినట్లు ప్రిన్సిపాల్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం కాశీ–తమిళ సాంస్కృతిక సమైక్యతను ప్రదర్శించే ఉద్దేశంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాయల్ పటేల్ నాయకత్వం వహించగా, తమిళ సంగీతానికి అనుగుణంగా రంగోలి, నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహించారు.

ఇదే సందర్భంలో హరిశ్చంద్ర గర్ల్స్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రియాంక తివారీ మాట్లాడుతూ, కాశీ తమిళ సంగమం సందర్భంగా తమ కళాశాలలో 15 రోజుల పాటు తమిళ భాషా శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు పాల్గొని, వారు నేర్చుకున్న విషయాలను కవితలు, పాటల రూపంలో ప్రదర్శించారని చెప్పారు. విద్యార్థుల్లో భాషాభ్యాసంపై కనిపించిన ఉత్సాహంతో, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అధికారికంగా తమిళ భాషా కోర్సును ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నామని ఆమె తెలిపారు.

కాశీ తమిళ సంగమం అనేది కాశీ, తమిళనాడు మధ్య శతాబ్దాల నాటి నాగరిక, సాంస్కృతిక, విద్యాపరమైన సంబంధాలను హైలైట్ చేసే ఒక సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా తమిళనాడుకు చెందిన విద్యార్థులు, పండితులు, ఉపాధ్యాయులు, కళాకారులు వారణాసికి వచ్చి అకాడమిక్ సమావేశాలు, భాషా వర్క్‌షాపులు, సాహిత్య పరస్పర చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొంటారు. భాషా విద్య, పరస్పర అవగాహన, జాతీయ సమైక్యతను పెంపొందించడమే దీని ప్రధాన లక్ష్యంగా ఉంది.