
యూపీ బడ్జెట్ రికార్డు స్థాయికి.. ఆర్థిక సర్వేలో కీలక విశేషాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గత తొమ్మిదేళ్లలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసిందని యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, రాష్ట్ర బడ్జెట్ పరిమాణం 2016-17లో రూ. 3.47 లక్షల కోట్లు ఉండగా, ప్రస్తుతం అది రూ. 8.33 లక్షల కోట్లకు చేరింది. అంటే గత పదేళ్ల కాలంలో బడ్జెట్ పరిమాణం రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. ఇదే సమయంలో రాష్ట్ర అప్పు-జిఎస్‌డిపి నిష్పత్తి 29.3 శాతం నుండి 28 శాతానికి తగ్గడం రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతోందని ప్రభుత్వం పేర్కొంది.
వైద్య రంగానికి పెద్దపీట
ప్రజారోగ్యంపై యోగి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి ఆరోగ్య రంగానికి రికార్డు స్థాయిలో రూ. 46,728 కోట్ల కేటాయింపులు జరిగాయి. 2017లో రాష్ట్రంలో కేవలం 36 మెడికల్ కాలేజీలు ఉండగా, 2025 చివరి నాటికి ఆ సంఖ్య 81కి (45 ప్రభుత్వ, 36 ప్రైవేట్) పెరగడం గమనార్హం. అలాగే, ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగి 96.12 శాతానికి చేరుకోవడం వల్ల శిశు మరణాల రేటు తగ్గినట్లు సర్వే వెల్లడించిందని నివేదికలో పేర్కొన్నారు.
వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా 24.9 శాతానికి పెరిగింది. దేశం మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో యూపీ వాటా 20.6 శాతానికి చేరుకుని అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా 65,000 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా సుమారు 2.55 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తోంది. అలాగే, చెరకు రైతులకు 2017 నుండి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 3.04 లక్షల కోట్ల చెల్లింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
పర్యాటక రంగంలో సరికొత్త రికార్డులు
ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. 2025లో రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య 2.4 రెట్లు పెరిగి 156.18 కోట్లకు చేరుకుంది. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌కు రికార్డు స్థాయిలో 66.30 కోట్ల మంది భక్తులు హాజరుకావడం రాష్ట్ర పర్యాటక ఆదాయానికి భారీగా ఊతమిచ్చింది. వారణాసి, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాల అభివృద్ధి పర్యాటకుల రాకకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.
మౌలిక సదుపాయాలు మరియు మహిళా భద్రత
రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు పెరగడం వల్ల ఎక్స్‌ప్రెస్‌వేలు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పారిశ్రామికంగా రూ. 50 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో నేరాల పట్ల 'జీరో టాలరెన్స్' విధానాన్ని పాటిస్తూ, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇది మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం పెరగడానికి దోహదపడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
లెక్కల్లో మాత్రమే భారీ బడ్జెట్
ఉత్తరప్రదేశ్ బడ్జెట్ ప్రస్తుతం రూ. 8.33 లక్షల కోట్లకు చేరడం ద్వారా దేశంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. మహారాష్ట్ర, తమిళనాడు వంటి ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చినా ఉత్తరప్రదేశ్ బడ్జెట్ పరిమాణం భారీ స్థాయిలో ఉండటం విశేషం.
దీనిని తెలుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే, ఆంధ్రప్రదేశ్ (సుమారు రూ. 2.9 లక్షల కోట్లు), తెలంగాణ (సుమారు రూ. 2.9 లక్షల కోట్లు) బడ్జెట్‌లను కలిపినా దాదాపు రూ. 5.8 లక్షల కోట్లు మాత్రమే అవుతుంది. అంటే, రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి బడ్జెట్ కంటే యూపీ బడ్జెట్ మరో రూ. 2.5 లక్షల కోట్లు అదనంగా ఉండటం ఆ రాష్ట్ర ఆర్థిక విస్తరణకు నిదర్శనం. దాదాపు 24 కోట్ల జనాభా అవసరాలు, భారీ ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా ఈ భారీ కేటాయింపులు జరుగుతున్నాయి.
జనాభా పరంగా చూస్తే, ఉత్తరప్రదేశ్ బడ్జెట్ పరిమాణం భారీగా ఉన్నప్పటికీ, తలసరి కేటాయింపుల విషయంలో తెలుగు రాష్ట్రాల కంటే వెనుకబడే ఉంది. ఉదాహరణకు, తెలంగాణలో సుమారు 4 కోట్ల జనాభాకు రూ. 2.9 లక్షల కోట్ల బడ్జెట్ అంటే సగటున ఒక వ్యక్తిపై రూ. 70 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు, కానీ యూపీలో 24 కోట్ల మందికి రూ. 8.33 లక్షల కోట్లు అంటే ఒక వ్యక్తిపై చేసే ఖర్చు సుమారు రూ. 35 వేలు మాత్రమే. అంటే వ్యక్తిగత స్థాయిలో లబ్ధిని చూసినప్పుడు ఇది ఇంకా తక్కువే అయినప్పటికీ, ఒకే పరిపాలనా యంత్రాంగం కింద రూ. 8 లక్షల కోట్లకు పైగా నిధులను సమీకరించి, నిర్వహించగల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోవడం అనేది ఒక రాష్ట్రంగా యూపీ సాధించిన పెద్ద విజయంగా పరిగణించబడుతోంది.
అయినప్పటికీ, దీనిని "పెద్ద బడ్జెట్" అనడానికి ప్రధాన కారణం దాని వృద్ధి వేగం, పెట్టుబడి వ్యయం. గత పదేళ్లలో బడ్జెట్ పరిమాణం రూ. 3.47 లక్షల కోట్ల నుండి ఏకంగా రూ. 8.33 లక్షల కోట్లకు పెరగడం ద్వారా యూపీ తన ఆదాయ వనరులను ఎంత వేగంగా పెంచుకుందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా రూ. 1.47 లక్షల కోట్లను కేవలం మౌలిక సదుపాయాలైన ఎక్స్‌ప్రెస్‌వేలు, ఎయిర్‌పోర్టుల కోసం కేటాయించడం వల్ల, రాబోయే రోజుల్లో అక్కడ పరిశ్రమలు పెరిగి తలసరి ఆదాయం కూడా మెరుగుపడే అవకాశం ఉంది. వెనుకబడిన రాష్ట్రం నుంచి ఒక భారీ ఆర్థిక శక్తిగా ఎదిగే క్రమంలో ఈ సంఖ్యలు అత్యంత కీలకంగా మారాయి.
మరోవైపు, భారత కేంద్ర బడ్జెట్ పరిమాణం సుమారు రూ. సుమారు రూ. 53.47 లక్షల కోట్లు ఉంటే, అందులో కేవలం ఉత్తరప్రదేశ్ వాటానే దాదాపు 6వ వంతు ఉండటం విశేషం. ఇంతటి భారీ బడ్జెట్‌ను నిర్వహిస్తూనే, రాష్ట్ర అప్పుల నిష్పత్తిని 28 శాతానికి తగ్గించుకోవడం ఉత్తరప్రదేశ్ సాధించిన కీలక ఆర్థిక విజయం. 2025 నాటికి 156 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షించడం వ్యవసాయ ఉత్పత్తిలో దేశంలోనే 20.6 శాతం వాటాను దక్కించుకోవడం వంటి అంశాలు ఈ రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
