
యూపీ ఎన్నికల ముందు ప్రత్యర్థుల కుట్రలు పెరుగుతాయి: మాయావతి
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి పార్టీ కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు. బీఎస్పీని అధికారానికి దూరం చేయడానికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు మరింత కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. బుధవారం పత్రికా సమావేశంలో మాట్లాడిన ఆమె, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ తమపై వ్యతిరేకంగా ఉన్న శక్తులు మరింత చురుకుగా మారతాయని చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను అనుసరించే వారంతా రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ఐక్యంగా ఉండి ‘అంబేద్కరవాద’ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. స్వాభిమాన సాధన కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ ఉద్యమాన్ని బలపరచడం కొనసాగించాలని ఆమె అన్నారు.
ఒంటరిగానే పోటీ చేస్తాం
2027 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ రాష్ట్రస్థాయి ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మాయావతి తెలిపారు. పార్టీ పనులు కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, త్వరలో వాటిని పూర్తి చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే బీఎస్పీని బలహీనపర్చేందుకు ప్రతిపక్షాలు అవలంబిస్తున్న కొత్త వ్యూహాలు, కుట్రలపై పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, ముస్లింలు, ఇతర మైనారిటీ మతల దుస్థితిపై చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు వంటి వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తామని చెప్పారు.
మీడియా దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేసి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలపరచాల్సిన బాధ్యత కలిగి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో దేశ, విదేశాల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)’ గురించిన చర్చలు ఎక్కువవుతున్న నేపథ్యంలో, ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా అసత్యం అని, పూర్తిగా అబద్ధం, వదంతి, కల్పిత వార్త అని ఆమె స్పష్టం చేశారు.
బి.ఎస్.పి. జాతీయ అధ్యక్షురాలు పలుమార్లు స్పష్టంగా ప్రకటించినట్లుగా, పార్టీ ఒంటరిగానే సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా 9 అక్టోబర్ 2025న బి.ఎస్.పి. స్థాపకుడు కాన్షీరాం మహాపరినిర్వాణ దినోత్సవ సందర్భంగా జరిగిన భారీ సభలో కూడా ఇదే విషయాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ, చర్చకూ తావులేదని తెలిపారు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అలాగే తనకు భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో టైప్-8 కొత్త బంగ్లా కేటాయించారనే విషయంపై కూడా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దీని గురించి కూడా మీడియా అసత్యాలను ప్రచారం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
2027లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2022 ఎన్నికల్లో బీఎస్పీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైన నేపథ్యంలో, ఈసారి పార్టీ పునరాగమనం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఎస్పీకి ఇది కీలక ఎన్నికగా భావిస్తున్నారు.
