
యూపీలో సామాజిక సంస్కర్తల విగ్రహాల అభివృద్ధికి నియోజకవర్గానికి రూ. కోటి
సామాజిక సంస్కర్తల విగ్రహాల అభివృద్ధి, సుందరీకరణ కోసం కొత్త పథకాన్ని మంగళవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. కోటి కేటాయించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. డా.బీఆర్. అంబేద్కర్ మూర్తి వికాస్ యోజన పేరుతో అమలు చేయనున్న ఈ పథకానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ పథకం ద్వారా సామాజిక న్యాయం కోసం కృషి చేసిన ప్రముఖ నేతల సేవలను గౌరవించడం లక్ష్యమని రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అసిమ్ అరుణ్ తెలిపారు.
ప్రభుత్వ భూములు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలను ఈ పథకం కింద అభివృద్ధి చేస్తారు. విగ్రహాల వద్ద రక్షణ కవచాలు ఏర్పాటు చేయడం, చుట్టూ గోడలు నిర్మించడం, ఉద్యానవనాల అభివృద్ధి, పచ్చదనం పెంపు, సరైన లైటింగ్ ఏర్పాటు వంటి పనులు చేపడతారు. ఒక్కో విగ్రహం అభివృద్ధికి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తారని మంత్రి తెలిపారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విగ్రహాల రూపకల్పన, శిల్పకళా లక్షణాలను దృష్టిలో ఉంచుకుని ప్రమాణిత నమూనాలను రూపొందిస్తారు. ప్రథమ దశలో 2025 డిసెంబర్ 31 వరకు ప్రజా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను సుందరీకరించనున్నారు. ఈ పథకం కింద బీఆర్.అంబేద్కర్‌తోపాటు సంత్‌రవిదాస్, కబీర్ దాస్, జ్యోతిబాఫూలే, వాల్మీకి వంటి సామాజిక సంస్కర్తల విగ్రహాలను కూడా అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ పథకం కింద రాష్ట్రంలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న సామాజిక సంస్కర్తల విగ్రహాల అభివృద్ధికి చర్యలు చేపడతారు. ప్రతి నియోజకవర్గానికి రూ.1 కోటి చొప్పున కేటాయించనుండగా, మొత్తం వ్యయం రూ.403 కోట్లుగా ఉంటుంది.
