
యూపీలో విషాదం.. తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెల్లు మృతి
ఘాజియాబాద్‌లోని ఓ హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో తొమ్మిదో అంతస్తు బాల్కనీ నుంచి దూకి ముగ్గురు మైనర్ అక్కాచెల్లెల్లు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆన్‌లైన్ కొరియన్ గేమ్‌లకు అలవాటు, మొబైల్ ఫోన్ వినియోగంపై విధించిన ఆంక్షల వల్ల కలిగిన మానసిక ఒత్తిడి ఈ విషాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సుమారు 2.15 గంటల సమయంలో, సాహిబాబాద్ ప్రాంతంలోని టీలామోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భారత్ సిటీ టవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో అంతస్తు బాల్కనీ నుంచి ముగ్గురు బాలికలు దూకినట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.భవనం కింద తీవ్ర గాయాలతో పడివున్న బాలికలను వెంటనే అంబులెన్స్‌లో లోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. మృతి చెందిన వారు చేతన్ కుమార్ కుమార్తెలైన నిషిక (16), ప్రాచీ (14), పాఖీ (12)గా పోలీసులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్ డీజీపీ రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ ఈ కేసును పూర్తిగా, లోతుగా దర్యాప్తు చేయిస్తున్నామన్నారు. అలాగే, సైబర్ అవగాహన అత్యంత అవసరం అని, ఆన్‌లైన్ వ్యసనానికి సంబంధించిన సమస్యలపై ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్లను సంప్రదించవచ్చని సూచించారు. షాలీమార్ గార్డెన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అతుల్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రాథమిక దర్యాప్తులో ఈ ముగ్గురు బాలికలు కొరియన్ టాస్క్ ఆధారిత ఇంటరాక్టివ్ ‘లవ్ గేమ్’కు తీవ్రంగా అలవాటు పడ్డట్లు వెల్లడైంది. కరోనా కాలం నుంచే వారు ఆన్‌లైన్ గేమ్‌లు, మొబైల్ ఫోన్ వినియోగంలో ఎక్కువ సమయం గడిపేవారని తెలిపారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిమిష్ పాటిల్ మాట్లాడుతూ, బాలికలు కొరియన్ కంటెంట్ ప్రభావంలోకి వెళ్లి ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లపైనే గడిపేవారని చెప్పారు. ఇటీవల వారి మొబైల్ వినియోగాన్ని తల్లిదండ్రులు పరిమితం చేయడంతో వారు తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యారని, అదే ఈ అతి తీవ్ర నిర్ణయానికి దారితీసి ఉండవచ్చని ఆయన తెలిపారు.
అన్ని పనులు కలిసే చేసేవారు
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ అక్కాచెల్లెల్లు స్నానం చేయడం నుంచి భోజనం, నిద్ర, సమయం గడపడం వరకు అన్నీ కలిసి చేసేవారు. ఎక్కువగా తమ గదిలోనే ఉంటూ, బయటి ప్రపంచంతో సంబంధాలు తగ్గించుకున్నారని దర్యాప్తులో తేలింది. గత రెండు నుంచి మూడు సంవత్సరాలుగా వారు పాఠశాలకు వెళ్లడం మానేశారని, అంతకుముందు కూడా వారి విద్యా ప్రగతి సంతృప్తికరంగా లేదని పోలీసులు తెలిపారు. గేమ్‌లోని ఏదైనా నిర్దిష్ట టాస్క్ లేదా లెవెల్ కారణంగానే ఈ ఘటన జరిగిందని నిర్ధారించే ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని, అయితే మొబైల్ ఫోన్ ఆంక్షల వల్ల కలిగిన మానసిక ఒత్తిడే ప్రధాన కారణంగా భావిస్తున్నామని అధికారులు చెప్పారు.
ఈ కుటుంబంలో నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని, తండ్రి రెండో వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులంతా ఒకే ఇంట్లో నివసించేవారని, అందరూ నిద్రపోయిన తర్వాతే ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా బాలికల సామానులో నుంచి ఒక డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఈ డైరీలో రాసినదంతా చదవండి… అన్నీ ఇందులోనే ఉన్నాయి అనే వాక్యం, ఏడుపు ముఖం ఎమోజీతో పాటు ‘సారీ పాపా, నిజంగా సారీ’ అనే చేతిరాత సందేశం లభ్యమైంది. ఈ ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేస్తూ, మొబైల్ ఫోన్లు, డిజిటల్ డేటాను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.
తండ్రి ఆవేదన
కరోనా కాలంలో ఈ గేమ్‌కు అలవాటు పడి, దాదాపు రెండున్నర నుంచి మూడు సంవత్సరాలుగా నిరంతరం ఆడుతున్నారని తండ్రి చెప్పారు. కన్నీళ్లతో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు. ఈ గేమ్‌లో ఇలాంటి టాస్కులు ఉంటాయని నాకు తెలియదు.
పోలీసుల ఫోరెన్సిక్ టీమ్ మొబైల్ ఫోన్లు పరిశీలించిన తర్వాతే అన్నీ తెలిశాయి. ముందే తెలిసి ఉంటే తప్పకుండా ఆపేవాడిని. ఏ తండ్రి అయినా అలా అనుమతించడు. బాలికలు తరచూ మాకు కొరియాకు వెళ్లాలని ఉందని చెప్పేవారని కూడా ఆయన తెలిపారు.ఘటన సమయంలో కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉన్నారని, నీళ్లు తాగుతామని చెప్పి లేచి, గది తలుపు లోపల నుంచి వేసుకుని బాల్కనీ నుంచి దూకారని చెప్పారు. వారు తమ మొబైల్ ఫోన్లను గది బయటకు విసిరేశారని, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మధ్య సోదరి ప్రాచీ తనను తాను బాస్ గా చెప్పుకునేదని, మిగిలిన ఇద్దరూ ఆమె మాటలు వినేవారని తండ్రి వెల్లడించారు.
మానసిక నిపుణుల హెచ్చరిక
ముంబైకి చెందిన ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ దీప్తి పురాణిక్ మాట్లాడుతూ ఇప్పటి యువతలో నిజ జీవిత గుర్తింపుకంటే, గేమ్‌లోని అవతార్‌నే తమ అసలు గుర్తింపుగా భావించే పరిస్థితి పెరుగుతోంది. వారి మానసిక ప్రపంచం మొత్తం ఆ గేమ్ చుట్టూనే తిరుగుతోందన్నారు.
ప్రత్యక్ష సాక్షి చెప్పిన ప్రకారం
పక్క భవనంలో నివసించే అరుణ్ అనే వ్యక్తి ఈ భయానక దృశ్యాన్ని చూశానని తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో, తొమ్మిదో అంతస్తు కిటికీ వద్ద పెద్ద సోదరి ఊగుతూ కూర్చున్నట్టు, మిగిలిన ఇద్దరూ ఆమెను ఆలింగనం చేసుకున్నట్టు కనిపించిందని చెప్పారు.
ఉన్నట్లుండి పెద్ద సోదరి వెనక్కి పడిపోవడంతో మిగిలిన ఇద్దరూ ఆమెతో పాటు కింద పడిపోయారని వివరించారు.
‘బ్లూ వేల్’ ఘటన గుర్తుకు
ఈ ఘటన 2017లో ముంబైలో 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు దారితీసిన ‘బ్లూ వేల్ ఛాలెంజ్’ను గుర్తుకు తెచ్చింది. ఆ గేమ్‌లో 50 రోజుల పాటు ప్రాణాంతక టాస్కులు ఉండేవి. ఆ ఛాలెంజ్ వల్ల రష్యా, మధ్య ఆసియా దేశాల్లో వందలాది ప్రాణాలు పోయాయని అప్పట్లో నివేదికలు వచ్చాయి.
