Let's talk: editor@tmv.in
యూపీలో మైనారిటీ ఓట్ల తొలగింపుకు కుట్ర: అఖిలేశ్ యాదవ్

యూపీలో మైనారిటీ ఓట్ల తొలగింపుకు కుట్ర: అఖిలేశ్ యాదవ్

Shaik Mohammad Shaffee
6 ఫిబ్రవరి, 2026

ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితాల నుంచి మైనారిటీల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఫామ్–7ను దుర్వినియోగం చేస్తూ పీడీఏ (పిచ్‌డా, దళిత్, అల్పసంఖ్యాక్) సమాజానికి చెందిన ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. “ఇప్పుడు నమ్మకం కలిగించే సంస్థ ఇంకేదీ లేదు” అని వ్యాఖ్యానించారు.

బీజేపీ, దాని మిత్రపక్షాలపై తీవ్ర విమర్శలు

‘ఎక్స్’ వేదికగా స్పందించిన అఖిలేశ్, బీజేపీ, దాని మిత్రపక్షాలు “నేరస్తుల్లా ప్రవర్తిస్తున్నాయి” అంటూ తీవ్రంగా విమర్శించారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) పీడీఏ సమాజానికి, ముఖ్యంగా మైనారిటీలకు చెందిన ఓట్లను తొలగించాలంటూ ఒత్తిళ్లు, వేధింపులు, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నకిలీ పత్రాల ఆధారంగా ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు తనపై ఒత్తిడి తెచ్చారని చెబుతున్న ఓ బీఎల్ఓ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

ఫామ్-7 దుర్వినియోగమంటూ ఆందోళన

ఫామ్-7 అనేది ఓటర్ల జాబితాలో ఉన్న పేరుపై అభ్యంతరం చెప్పడానికి లేదా ఇప్పటికే నమోదైన ఓటును తొలగించేందుకు ఉపయోగించే దరఖాస్తు. ఈ ఫామ్‌ను విస్తృతంగా దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని అఖిలేశ్ ఆరోపించారు. ప్రతి పౌరుడికి ఉన్న ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందని గుర్తు చేశారు.

తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఈ వ్యవహారంపై తక్షణమే ఫామ్-7 వినియోగాన్ని నిలిపివేయాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సమర్పించిన అన్ని ఫామ్-7 దరఖాస్తులను రద్దు చేయాలని, క్లెయిమ్–అభ్యంతరాల ప్రక్రియను వెంటనే ఆపాలని కోరారు. బీఎల్ఓలపై ఒత్తిడి తెస్తున్న వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని, వేగవంతమైన విచారణ జరపాలని, సరైన వ్యవస్థ ఏర్పాటు అయ్యే వరకు ఫామ్-7పై నిషేధం విధించాలని సూచించారు. అంతేకాదు, ఈ కుట్ర వెనుక ఉన్న దేశవ్యతిరేక శక్తులను గుర్తించేందుకు న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

నిజాయితీ గల జర్నలిస్టులు, అధికారులకు పిలుపు

ఈ కుట్రను బయటపెట్టేందుకు నిజాయితీ గల జర్నలిస్టులు, అధికారులు ముందుకు రావాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

పీడీఏ ప్రహరీలకు అప్రమత్తత సూచన

పీడీఏ సమాజ ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్టీ ఏర్పాటు చేసిన ‘పీడీఏ ప్రహరీలు’ అప్రమత్తంగా ఉండాలని అఖిలేశ్ సూచించారు. ప్రతి చెల్లుబాటు అయ్యే ఓటును కాపాడాలని, అవకతవకలకు సంబంధించిన ఆధారాలు సేకరించాలని, ఎఫ్‌ఐఆర్‌లకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అధికార పార్టీ ఈ చర్యలకు పాల్పడటం రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనేనని ఆయన వ్యాఖ్యానించారు.

పీడీఏ- ఐక్యత, ఆశకు చిహ్నం

మరో పోస్టులో పీడీఏ అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదని, అది అణచివేతకు గురైన వర్గాల ఐక్యతకు ప్రతిరూపమని అఖిలేశ్ యాదవ్ అభివర్ణించారు. సామాజిక న్యాయం, సమాన గౌరవం కోసం పీడీఏ సమాజం ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చిందని, ఇక విభజన రాజకీయాల కాలం చెల్లిందని ఆయన పేర్కొన్నారు. సానుకూల, అభ్యుదయ ఆలోచనలతో సాగుతున్న పీడీఏ.. ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. గమనార్హం ఏమంటే, 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెనుకబడిన వర్గాలు (పీ), దళితులు (డీ), మైనారిటీలను (ఏ) ఏకం చేసే లక్ష్యంతో అఖిలేశ్ ఈ ‘పీడీఏ’ నినాదాన్ని తెరపైకి తెచ్చారు.

యూపీలో మైనారిటీ ఓట్ల తొలగింపుకు కుట్ర: అఖిలేశ్ యాదవ్ - Tholi Paluku