
యూపీలో నకిలీ ఓట్లు సృష్టించే మిషన్‌లో బీజేపీ: అఖిలేశ్ యాదవ్
ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి 2.89 కోట్ల పేర్లు తొలగించడంపై సమాజ్‌వాది పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నకిలీ ఓట్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. లక్నోలో మీడియాతో మాట్లాడిన అఖిలేశ్ యాదవ్, ప్రజలందరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. బూత్ స్థాయి వరకు వెళ్లి ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించండి. మీ ఓటు దెబ్బతినకుండా చూసుకోండి. బీజేపీ సృష్టిస్తున్న తప్పుడు కథనాల్లో చిక్కుకోకండి అని ఆయన అన్నారు. ఇదే సమయంలో యూపీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ బీజేపీ నేతలను తొలిసారిగా కలవరపెడుతోందని అఖిలేశ్ వ్యాఖ్యానించారు. ఓటర్ల సంఖ్య పెరగాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. పరిపాలనా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నకిలీ ఓట్లు సృష్టిస్తే, సమాజ్‌వాది పార్టీకి చెందిన ‘పీడీఏ ప్రజారి’ కార్యకర్తలు వారి మీద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తారు. ఇన్ని ఓట్లు తొలగించడం చూస్తే మొత్తం బీజేపీ నకిలీ ఓట్లు తయారుచేసే మిషన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా అధికారులను ఓట్ల సంఖ్య పెంచాలని ఆదేశిస్తున్నట్లు ఉందని అఖిలేశ్ యాదవ్ అన్నారు.
2.89 కోట్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించాం
ఇదిలా ఉండగా మంగళవారం ఉత్తరప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) నవదీప్ రిన్వా ఎస్‌ఐఆర్‌లోని ఎన్యుమరేషన్ దశ పూర్తయిన తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణను ప్రకటించారు. ఈ ప్రక్రియలో మొత్తం 2.89 కోట్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించామని తెలిపారు. మాకు సుమారు 12 కోట్లు 55 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు అందాయి. అంటే ఈ సంఖ్యలో ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగాలని సంతకం చేసి ఫారాలు సమర్పించారని చెప్పారు. తొలగించిన ఓట్ల వివరాలను వివరిస్తూ 46.23 లక్షల మంది మరణించిన ఓటర్లు, 2.17 కోట్ల మంది వలస వెళ్లినవారు (తమ నివాస ప్రాంతం మార్చుకున్నవారు, శాశ్వతంగా వెళ్లిపోయినవారు, కనిపించని వారు లేదా బూత్ లెవల్ అధికారులకు అందుబాటులో లేనివారు), 25.47 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ అన్ని వర్గాలను కలిపి మొత్తం 2.89 కోట్ల పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు.
అక్టోబర్ 27, 2025 నాటికి ఉన్న మొత్తం 15,44,30,092 మంది ఓటర్లలో, డిసెంబర్ 26, 2025 వరకు 12,55,56,025 మంది తమ ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించారని, ఇది ఎస్‌ఐఆర్ మొదటి దశలో ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని సూచిస్తుందని సీఈఓ తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలుకు జనవరి 6, 2026 నుంచి ఫిబ్రవరి 6, 2026 వరకు గడువు నిర్ణయించారు. అర్హులైన ఓటర్లను చేర్చడం లేదా అనర్హుల పేర్లు తొలగించేందుకు ఎవరైనా క్లెయిమ్ లేదా అభ్యంతరం దాఖలు చేయవచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 403 ఈఆర్‌వోలు (ఈఆర్ఓస్), 2042 ఏఈఆర్‌వోలు (ఏఈఆర్ఓస్) పనిచేస్తారని, అవసరాన్ని బట్టి అదనపు ఏఈఆర్‌వోలను కూడా నియమించామని, ఫిబ్రవరి 27, 2026లోపు అన్ని అభ్యంతరాలను పరిష్కరిస్తామని సీఈఓ వెల్లడించారు.
