Let's talk: editor@tmv.in
యూపీలో తోడేళ్ల దాడిలో 5 ఏళ్ల బాలుడు మృతి

యూపీలో తోడేళ్ల దాడిలో 5 ఏళ్ల బాలుడు మృతి

Pinjari Chand
30 నవంబర్, 2025

ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా కైసర్‌గంజ్ తహసీల్‌లో తోడేళ్ల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో తోడేళ్ల దాడులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ సంఘటన ఆందోళన కలిగిస్తోంది. రోషన్ కుమార్ కుమారుడు స్టార్ (5) శుక్రవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో రెండు తోడేళ్లు దాడి చేశాయి. ఒక తోడేలు బాలుడిని పట్టుకొని పొలంలోకి ఈడ్చుకెళ్లింది. అప్పటికి పొరుగింటి వాళ్లు అరుస్తూ కర్రలు, గునపాలతో తరమడంతో తోడేళ్లు పారిపోయాయి. పొలంలో తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన బాలుడిని గుర్తించిన స్థానికులు, కైసర్‌గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, తర్వాత జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో లక్నో మెడికల్ కాలేజీకి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు.

సంఘటన జరిగిన మల్లాహన్ పూర్వా గ్రామం ఘాఘ్రా నది ఒడ్డున, చెరకు పొలాల మధ్య ఉండటంతో తోడేళ్లు అక్కడే దాక్కునే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు 9 మంది మృతి

డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 9 నుంచి కైసర్‌గంజ్, మహ్సీ తహసీల్స్‌లో తోడేళ్ల దాడుల్లో 9 మంది (వీరిలో 7 మంది పిల్లలు) మరణించగా, 32 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ప్రత్యేక బృందాలు, డ్రోన్లతో గాలిస్తున్నాం. గ్రామ సమీపంలో మూడు బోనులు ఏర్పాటు చేశాం” అని చెప్పారు. సెప్టెంబర్ 28 నుంచి అటవంగి శాఖ షూటర్‌తో నాలుగు తోడేళ్లను కాల్చి చంపినట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెప్టెంబర్ 27న ప్రాంతంలో పర్యటించి, మనుషులపై దాడి చేసే తోడేళ్లను పట్టుకోలేకపోతే కాల్చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. బాలుడి మరణం పట్ల కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

'ఆపరేషన్ భేడియా'

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడులను అరికట్టడానికి చేపట్టిన ప్రత్యేక ప్రణాళికకు 'ఆపరేషన్ భేడియా' అనే పేరు పెట్టింది. 'భేడియా' అంటే హిందీలో 'తోడేలు' అని అర్థం. ఈ ఆపరేషన్ 2024 ఆగస్టు నెలలో ప్రారంభమైంది, ముఖ్యంగా మహ్సీ, కైసర్‌గంజ్ తహసీల్స్‌లో జరుగుతున్న తోడేళ్ల దాడులను ఆపడానికి 16 ప్రత్యేక బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.