
యూపీలో చెరకు రైతులకు శుభవార్త
ఉత్తరప్రదేశ్‌లో చెరకు రైతులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2025–26 క్రషింగ్ సీజన్ కోసం చెరకు ధరను క్వింటాల్‌కు రూ.30 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త ధరల ప్రకారం ముందస్తు రకానికి రూ.400 క్వింటాల్‌కు, సాధారణ రకానికి రూ.390 క్వింటాల్‌కు చెల్లించనున్నారు. ఈ పెంపుతో రాష్ట్రంలోని లక్షలాది చెరకు రైతులకు అదనంగా సుమారు రూ.3,000 కోట్లు లభించనున్నట్లు సీఎంఓ కార్యాలయం తెలిపింది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో యోగి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చెరకు రైతులకు రికార్డు స్థాయిలో రూ.2.90 లక్షల కోట్లు చెల్లించింది. 2007–2017 మధ్య గత ప్రభుత్వాలు కేవలం రూ.1.47 లక్షల కోట్లు మాత్రమే చెల్లించాయి. అంటే ప్రస్తుత ప్రభుత్వ కాలంలోనే రూ.1.42 లక్షల కోట్లు అదనంగా రైతుల ఖాతాల్లోకి వెళ్లాయి. రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు లక్ష్మీ నారాయణ్ చౌదరి మాట్లాడుతూ 2017 నుంచి ఇప్పటి వరకు చెరకు ధరను మొత్తం క్వింటాల్‌కు రూ.85 పెంచాం. ఇది రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా మరో కీలకమైన ముందడుగు అని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 122 షుగర్ మిల్లులు పనిచేస్తున్నాయి. గత ప్రభుత్వాల కాలంలో చౌక ధరలకు అమ్మిన 21 మిల్లులను పునరుద్ధరించడంతో పాటు, కొత్తగా నాలుగు మిల్లులు స్థాపించారు. మూసివేసిన ఆరు యూనిట్లు తిరిగి ప్రారంభమయ్యాయి. 42 మిల్లుల సామర్థ్యం పెంచి, ఎనిమిది పెద్ద మిల్లుల సమానమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించామని ప్రభుత్వం తెలిపింది. ఇదే సమయంలో పరిశ్రమల్లో ఎనిమిది ఏళ్లలో రూ.12,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. రెండు మిల్లుల్లో కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. చెరకు పాస్‌లను ఆన్‌లైన్‌లో జారీ చేసే ‘స్మార్ట్ షుగర్‌కేన్ ఫార్మర్’ సిస్టమ్ ద్వారా మొత్తం వ్యవస్థను ప్రభుత్వం డిజిటల్ చేసింది. రైతుల ఖాతాల్లోకి నేరుగా డీబీటీ ద్వారా చెల్లింపులు చేస్తున్నామని తెలిపింది. ఇథనాల్ ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగి 41 కోట్ల లీటర్ల నుంచి 182 కోట్ల లీటర్లకు చేరుకుంది. డిస్టిలరీల సంఖ్య 61 నుంచి 97కు పెరిగింది. చెరకు సాగు విస్తీర్ణం 20 లక్షల హెక్టార్ల నుంచి 29.51 లక్షల హెక్టార్లకు పెరిగి ఉత్తరప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.
