
యూపీలో కూతురుకు డైవర్స్ మంజూరు.. డప్పులతో తండ్రి స్వాగతం
విడాకులను అపహాస్యంగా చూసే సామాజిక భావజాలానికి విరుద్ధంగా, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక కుటుంబం విభిన్న సందేశాన్ని ఇచ్చింది. రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర కుమార్ శర్మ తన ఏకైక కుమార్తె ప్రణితా వశిష్ఠకు విడాకులు మంజూరైన తరువాత డప్పులు మోగిస్తూ, పూలమాలలు వేసి ఘనంగా ఇంటికి తీసుకువచ్చారు. ఫ్యామిలీ కోర్టు శనివారం విడాకులు మంజూరు చేసిన వెంటనే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రణితా వశిష్ఠ 2018 డిసెంబర్ 19న షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ ఆర్మీ మేజర్‌ను వివాహం చేసుకున్నట్లు ఆమె న్యాయవాదులు తెలిపారు. అయితే వివాహానంతరం మానసిక, శారీరక, భావోద్వేగ వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. దంపతులకు కుమారుడు పుట్టినా పరిస్థితి మారకపోవడంతో ప్రణితా మీరట్ కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి శక్తిపుత్ర తోమర్ శనివారం విడాకులు మంజూరు చేశారు.
కూతురు సంతోషమే ముఖ్యం
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రణితాను బంధువులు డప్పుల మోతల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా ఇంటికి తీసుకువచ్చారు. ఇంటి వద్ద ఆమె తండ్రి పూలహారాలతో స్వాగతం పలికి మిఠాయిలు పంచారు. కుటుంబ సభ్యులు ‘ఐ లవ్ మై డాటర్’ అని ముద్రించిన టీషర్ట్లు ధరించి ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. నా కూతురు వివాహ జీవితంలో సంతోషంగా లేకపోతే ఆమెను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడం నా బాధ్యత. మేము ఎలాంటి భరణం కూడా కోరలేదు. నా కూతురిని మాత్రమే ఇంటికి తీసుకువచ్చానని జ్ఞానేంద్ర కుమార్ శర్మ తెలిపారు. కూతురి సంతోషం, గౌరవం సమాజపు అభిప్రాయాల కంటే ముఖ్యమని ఆయన అన్నారు.
కుటుంబ మద్దతు కొత్త జీవితాన్ని ఇచ్చింది
సైకాలజీలో పీజీ చేసిన ప్రణితా ప్రస్తుతం తేజ్‌గఢిలోని ప్రణవ్ వశిష్ఠ జుడీషియల్ అకాడమీలో ఫైనాన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2022లో చండీగఢ్‌లో జరిగిన ప్రమాదంలో ఆమె సోదరుడు ప్రణవ్ వశిష్ఠ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివాహ జీవితంలో తాను మానసికంగా బలహీనపడిపోయానని ప్రణితా పేర్కొన్నారు. అయితే కుటుంబం ఇచ్చిన మద్దతు తనకు కొత్త జీవితం ప్రారంభించేందుకు సహాయపడిందన్నారు. వేధింపులకు గురవుతున్న మహిళలు మౌనంగా ఉండకూడదని, తమ కోసం తాము నిలబడాలని ఆమె సూచించారు. బలంగా ఉండండి. బాగా చదువుకోండి. స్వతంత్రంగా ఉండండి. ఆ తరువాతే వివాహం గురించి ఆలోచించండని ఆమె అన్నారు. ఈ ఘటన విడాకులపై ఉన్న సామాజిక అపోహలను తొలగించి మహిళలకు గౌరవప్రదమైన జీవితం కోసం నిలబడే ధైర్యం కలిగించగలదని స్థానికులు భావిస్తున్నారు.
