Let's talk: editor@tmv.in
యూపీఐ లావాదేవీల‌పై.. నో చార్జెస్

యూపీఐ లావాదేవీల‌పై.. నో చార్జెస్

FL - BRTH
2 అక్టోబర్, 2025

యూపీఐ లావాదేవీల‌పై చార్జీలు విధించే ప్ర‌తిపాద‌న ఆర్బీఐ వ‌ద్ద లేద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ సంజ‌య్ మ‌ల్హోత్రా స్ప‌ష్టం చేశారు. గ‌త కొంతకాలంగా యూపీఐ లావాదేవీల‌పై చార్జీలు వ‌సూలు చేస్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ ప్ర‌చారానికి ఆర్బీఐ గ‌వ‌ర్నర్ స్ప‌ష్ట‌త‌నిచ్చారు. వినియోగ‌దారుల నుంచి యూపీఐ లావాదేవీల‌పై ఎలాంటి చార్జీలు వ‌సూలు చేయ‌బ‌డ‌వ‌ని, ఉచితంగానే లావాదేవీలు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. దేశ‌వ్యాప్తంగా డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హించ‌డమ‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్యం. తాజాగా ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ సంజ‌య్ మ‌ల్హోత్ర చేసిన వ్యాఖ్య‌లతో.. కేంద్ర ప్ర‌భుత్వం డిజిట‌ల్ చెల్లింపుల ప్రోత్సాహానికి గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్న త‌రుణంలో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌టం, ప్ర‌పంచంలోనే అతిపెద్ద రియ‌ల్ టైమ్ చెల్లింపుల మార్కెట్ గా భార‌త్ స్థానాన్ని సుస్థిరం చేసిన‌ట్టుయింది.

ఉచితంగా యూపీఐ లావాదేవీల కొన‌సాగింపు అంశంపై అస్ప‌ష్ట‌త ఉన్న స‌మ‌యంలో ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌ట‌న రావ‌డంతో స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా డిజిట‌ల్ చెల్లింపులను ప్రోత్స‌హించాల‌ని ఉచితంగా సేవ‌ల‌ను అందిస్తోంది. కానీ ఎంత కాలం ఇలా ప్ర‌భుత్వం ఉచితంగా సేవ‌లు అందిస్తుంది, ఏదో ఒక‌రోజు లావాదేవీలు చేసేవారు ఎంతో కొంత ఫీజు చెల్లించాలి అంటూ ప్ర‌చారం మొద‌లైంది. దీంతో యూపీఐ లావాదేవీలు త‌గ్గుతాయ‌ని నిపుణులు అంచ‌నా వేశారు. ఎందుకంటే ప్ర‌తి లావాదేవీకి చార్జీ వ‌సూలు చేస్తే వినియోగ‌దారుడు న‌ష్ట‌పోతాడు. మ‌ళ్లీ న‌గ‌దు వైపు మళ్లుతాడు. న‌గ‌దుతోనే లావాదేవీలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతాడు. అప్పుడు డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హించాల‌న్న ప్ర‌భుత్వ ల‌క్ష్యం నీరుగారుతుంది. ఈ నేపథ్యంలోనే ప్ర‌భుత్వం, ఆర్బీఐ యూపీఐ లావాదేవీల‌పై చార్జీలు వ‌సూలుకు సంబంధించి స్ప‌ష్ట‌త‌నిచ్చింది.

యూపీఐ లావాదేవీల‌పై.. నో చార్జెస్ - Tholi Paluku