
యూపీఐ ద్వారా ఈపీఎఫ్ నగదు ఉపసంహరణకు కొత్త యాప్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు ఇకపై తమ ఈపీఎఫ్ ఖాతాల్లోని నగదును యూపీఐ (యూపీఐ) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఉపసంహరించుకునే అవకాశం పొందనున్నారు. ఇందుకోసం కొత్త మొబైల్ యాప్‌ను ఈపీఎఫ్‌వో ఏప్రిల్‌లో ప్రారంభించనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుపై పని చేస్తుండగా, ఈపీఎఫ్ మొత్తంలో ఒక భాగాన్ని ఫ్రీజ్ చేసి, పెద్ద మొత్తాన్ని యూపీఐ ద్వారా ఉపసంహరణకు అనుమతించే విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొత్త యాప్ ద్వారా సభ్యులు తమకు అర్హత ఉన్న ఈపీఎఫ్ నిల్వను చూసుకోవడంతో పాటు, యూపీఐ పిన్ ఉపయోగించి నేరుగా బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసుకోగలరు. ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యులు యూఏఎన్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా సేవలు పొందుతున్నారు. ఇవి కొనసాగుతూనే, కొత్త ప్రత్యేక యాప్ సేవల లభ్యతను మరింత మెరుగుపరుస్తుందని అధికారులు తెలిపారు. పాస్‌బుక్ వివరాలు, బ్యాలెన్స్ వంటి ఇతర సేవలూ అందుబాటులో ఉంటాయి. ఈ సేవను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రస్తుతం 100 డమ్మీ ఖాతాలతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. సాంకేతిక లోపాలు తొలగించిన అనంతరం ఏప్రిల్‌లో అధికారికంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈపీఎఫ్ నగదు ఉపసంహరణకు సభ్యులు తప్పనిసరిగా క్లెయిమ్ దాఖలు చేయాల్సి వస్తోంది. ఆటో సెటిల్‌మెంట్ విధానంలో క్లెయిమ్‌లు మూడు రోజుల్లో పరిష్కరించాలంటున్నా , కొత్త విధానం ద్వారా ఈ ప్రక్రియను మరింత సరళం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు 8 కోట్ల మంది సభ్యులు ఉన్న ఈపీఎఫ్‌వో ఏటా 5 కోట్లకు పైగా క్లెయిమ్‌లను పరిష్కరిస్తోంది. కొత్త యూపీఐ ఆధారిత వ్యవస్థతో ఈపీఎఫ్‌వోపై భారాన్ని తగ్గించడంతో పాటు, బ్యాంకుల తరహా సేవలను అందించడమే లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
