
యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ 2025 ఫలితాలు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ (సీఎస్ఈ) మెయిన్స్ 2025 పరీక్ష ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈ పరీక్షలు ఆగస్టు 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో నిర్వహించబడిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/లో చూడవచ్చు. తాజాగా విడుదలైన ఫలితాల ప్రకారం, మొత్తం 2,736 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించి, తదుపరి దశ అయిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) రౌండ్‌కు ఎంపికయ్యారు. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన మెరిట్ లిస్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
పర్సనాలిటీ టెస్ట్
మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)తో పాటు ఇతర గ్రూప్-ఏ, గ్రూప్-బీ కేంద్ర సర్వీసులలో ఎంపికకు కీలకంగా నిలిచే పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూల తేదీలను కమిషన్ త్వరలో వెల్లడిస్తుంది. పర్సనాలిటీ టెస్ట్‌లు న్యూఢిల్లీ-110069లోని ధోల్‌పూర్ హౌస్, షాజహాన్ రోడ్‌లో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో జరుగుతాయి. ఇంటర్వ్యూకు సంబంధించిన ఈ-లెటర్స్ త్వరలో కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు అభ్యర్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను (విద్యార్హతలు, రిజర్వేషన్ కేటగిరీ, పీడబ్ల్యూబీడీ స్థితికి సంబంధించినవి), ఫోటో ఐడీ ప్రూఫ్‌లను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
తుది ఎంపిక
పర్సనాలిటీ టెస్ట్ పూర్తయిన తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ లిస్ట్‌ను యూపీఎస్సీ విడుదల చేస్తుంది. ఈ మార్కుల ఆధారంగానే అభ్యర్థులకు వారి సర్వీస్ ప్రాధాన్యత ప్రకారం నియామకాలు చేపడుతారు. ఈ ఏడాది మొత్తం 979 పోస్టులను కమిషన్ భర్తీ చేయనుంది. అభ్యర్థులు యూపీఎస్సీ సీఎస్ఈ మెయిన్స్ మెరిట్ లిస్ట్ పీడీఎఫ్ ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న సంబంధిత లింక్‌పై క్లిక్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి. మెయిన్స్ ఫలితాలపై ఎటువంటి సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఉంటే, అభ్యర్థులు యూపీఎస్సీ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చని కమిషన్ సూచించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్ జనవరి 22న విడుదలైంది. ప్రిలిమ్స్ పరీక్షను దేశవ్యాప్తంగా మే 25న నిర్వహించారు. 14,161 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.
