Let's talk: editor@tmv.in
యూపీఎస్సీ పరీక్షల్లో దివ్యాంగ అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించండి:సుప్రీంకోర్టు

యూపీఎస్సీ పరీక్షల్లో దివ్యాంగ అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించండి:సుప్రీంకోర్టు

Pinjari Chand
4 డిసెంబర్, 2025

దివ్యాంగ అభ్యర్థుల హక్కుల సంరక్షణలో మరో మైలురాయిగా సుప్రీంకోర్టు బుధవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షకు కనీసం ఏడు రోజుల ముందు వరకు స్క్రైబ్ (రాత పరీక్ష రాయడానికి సహాయకుడు) మార్చుకునే అవకాశం కల్పించే నిబంధనను యూపీఎస్సీ తన పరీక్షా నోటిఫికేషన్‌లలో తప్పనిసరిగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. అలాగే దృష్టి వైకల్యం ఉన్న అభ్యర్థుల కోసం స్క్రీన్-రీడర్ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షల్లో అందుబాటులోకి తేవాలని, దీనికి సంబంధించిన తీసుకున్న ప్రణాళిక, టైమ్‌లైన్, విధానాలను రెండు నెలల్లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని యూపీఎస్సీని ఆదేశించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ తీర్పు ఇస్తూ ‘దివ్యాంగులకు కల్పించే సౌకర్యాలు దయాదాక్షిణ్యాలు కావు, సమానత్వం, గౌరవం, వివక్ష లేని జీవనం అనే రాజ్యాంగ హామీల రూపమే’ అని పేర్కొంది. ప్రభుత్వ పాలనలో నిజమైన సమ్మిళితత్వం కేవలం ప్రగతిశీల విధానాలు రూపొందించడంలో కాదు, వాటిని నిజంగా, ప్రభావవంతంగా అమలు చేయడంలో ఉంది అని ధర్మాసనం గుర్తు చేసింది.

పిటిషన్ నేపథ్యం

దివ్యాంగుల హక్కుల కోసం పనిచేసే ‘మిషన్ యాక్సెసిబిలిటీ’ సంస్థ దాఖల చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు వెలువడింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో స్క్రైబ్ నమోదు చేసుకునే గడువును సడలించడం, దృష్టి వైకల్యం ఉన్న అభ్యర్థులు స్క్రీన్-రీడర్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన ల్యాప్‌టాప్, అందుబాటులో ఉండే డిజిటల్ ప్రశ్నాపత్రాలు వినియోగించుకునే సౌకర్యం కల్పించాలని పిటిషన్ కోరింది.

కోర్టు ఇచ్చిన ముఖ్య ఆదేశాలు

• యూపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షా నోటిఫికేషన్‌లో స్పష్టమైన నిబంధన చేర్చాలి

• స్క్రైబ్ అర్హత ఉన్న అభ్యర్థులు పరీక్షకు కనీసం 7 రోజుల ముందు వరకు స్క్రైబ్ మార్చుకునే అవకాశం ఉండాలి.

• అలాంటి అభ్యర్థనలను 3 పని దినాల్లోగా కారణాలతో కూడిన ఆర్డర్ ద్వారా పరిష్కరించాలి.

• స్క్రీన్-రీడర్ సాఫ్ట్‌వేర్ అమలు ప్రణాళిక, టైమ్‌లైన్, పరీక్ష కేంద్రాల్లో ప్రామాణికీకరణ, భద్రతా చర్యల వివరాలతో కూడిన అఫిడవిట్ రెండు నెలల్లో దాఖలు చేయాలి.

• తదుపరి నిర్వహించే పరీక్షల నుంచే ఈ సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

• దివ్యాంగుల సాధికారత శాఖ, జాతీయ దృష్టి వైకల్యుల సాధికారత సంస్థతో సమన్వయంతో ఒకే విధమైన మార్గదర్శకాలు రూపొందించాలి.

• కేంద్రంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, సామాజిక న్యాయం మంత్రిత్వ శాఖ యూపీఎస్సీకి అవసరమైన అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ సహకారం అందించాలి.

పరీక్షల గోప్యత, న్యాయబద్ధత, పారదర్శకతను కాపాడుతూనే ఈ చర్యలు అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 దివ్యాంగుల హక్కుల చట్టం-2016 నిబంధనలను పూర్తిగా అమలు చేయడానికి ఉద్దేశించినవని పేర్కొంది. విషయాన్ని తదుపరి విచారణ కోసం ఫిబ్రవరి 16, 2026కి వాయిదా వేస్తూ ఆ రోజు యూపీఎస్సీ కంప్లయన్స్ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. సమాజం న్యాయం, సమ్మిళితత్వం కేవలం ప్రకటనల్లో కాదు, ప్రతి పౌరుడికీ తన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశాలు కల్పించడంలో ఉంది. నిజమైన సమానత్వం అంటే ఏకరూపత కాదు, అడ్డంకులను తొలగించి అందరినీ సమాన స్థాయిలో నిలబెట్టడం అని ధర్మాసనం తన తీర్పులో ప్రముఖంగా పేర్కొంది.

యూపీఎస్సీ పరీక్షల్లో దివ్యాంగ అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించండి:సుప్రీంకోర్టు - Tholi Paluku