Let's talk: editor@tmv.in
యూపీఎస్సీ ఇంటర్వ్యూల జాబితాలో 43 మంది తెలంగాణ అభ్యర్థులు

యూపీఎస్సీ ఇంటర్వ్యూల జాబితాలో 43 మంది తెలంగాణ అభ్యర్థులు

Gaddamidi Naveen
13 నవంబర్, 2025

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అమలవుతున్న 'రాజీవ్ గాంధీ సివిల్ సర్వీసెస్ అభయ హస్తం' పథకం యూపీఎస్సీ సివిల్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన తెలంగాణకు చెందిన 43 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణులై, ఫైనల్‌ ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఇది రాష్ట్రానికి గర్వకారణమైన ఘనత. ఈ ఫలితాలు పథక ప్రభావాన్ని,ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల సార్థకతను నిరూపిస్తున్నాయని అన్నారు. ఆయన అభ్యర్థులను అభినందిస్తూ, వారిలో ప్రతిభతో పాటు ప్రభుత్వ సహకారం కూడా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

2024లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మొత్తం 342 మంది యువతకు రూ.3.62 కోట్లు ఆర్థిక సహాయం అందించారు. ఈ పథకానికి సింగరేణి కంపెనీ నిధులు సమకూర్చిందన్నారు. మెయిన్స్‌ అర్హత సాధించిన ప్రతి అభ్యర్థికి రూ.1 లక్ష, ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారికి అదనంగా మరో రూ.1 లక్ష ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోందని ఆయ‌న తెలిపారు.అలాగే 2025లో మొత్తం 202 మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షలకు ప్రభుత్వ మద్దతుతో హాజరయ్యారని. వారిలో 43 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక అయ్యారు అని తెలిపారు. వీరందరికీ మరో రూ.1 లక్ష ఆర్థిక సాయంతోపాటు, ఇంటర్వ్యూ సిద్ధత కోసం ఢిల్లీలో ఉచిత వసతి సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పిస్తోందని ఆయ‌న పేర్కొన్నారు.ఈ పథకం కాంగ్రెస్‌ ప్రభుత్వ నిరుద్యోగ యువత సాధికారతకు అంకితభావానికి నిదర్శనమ‌ని. రాష్ట్ర యువత తమ సివిల్‌ సర్వీసెస్‌ కలలను సాకారం చేసుకునేందుకు ఇది దారితీస్తోందని తెలిపారు.

పథకం ప్రారంభమైన మొదటి ఏడాదిలోనే 140 మంది మెయిన్స్‌ అర్హత సాధించగా, 20 మంది ఇంటర్వ్యూలకు చేరుకున్నారు. వారిలో 7 మంది యూపీఎస్సీ తుది పరీక్షలో ఎంపికై ప్రస్తుతం వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారని ఆయ‌న పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా తెలంగాణ యువతలో సివిల్‌ సర్వీసెస్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగిందని, భవిష్యత్తులో మరింతమంది జాతీయ స్థాయి పరీక్షల్లో విజయాలు సాధిస్తారని ఆయ‌న ఆశాభావం వ్యక్తం చేశారు.

యూపీఎస్సీ ఇంటర్వ్యూల జాబితాలో 43 మంది తెలంగాణ అభ్యర్థులు - Tholi Paluku