
యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ కన్నేసింది: కేటీఆర్
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై, యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యూనివర్సిటీకి కేటాయించిన 50 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యూనివర్సిటీకి ఇచ్చిన భూమిని తిరిగి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని, ఇది విద్యా సంస్థల భవిష్యత్తుకు తీవ్ర నష్టం కలిగించే అంశమని విద్యార్థులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉన్న దేశంలోనే ఏకైక ఉర్దూ యూనివర్సిటీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. విశిష్టమైన విద్యాసంస్థను రియల్ ఎస్టేట్ అవసరాల కోసం వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందని విమర్శించారు. 50 ఎకరాల యూనివర్సిటీ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలనుకోవడం దారుణమని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సీరియల్ కిల్లర్ లా కాకుండా సీరియల్ ల్యాండ్ స్నాచర్ గా మారిందని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
యూనివర్సిటీల భూములను గుంజుకోవడం ఒక పద్ధతిగా మారిందని పేర్కొన్న కేటీఆర్, గతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని హైకోర్టు పేరుతో తీసుకున్నారని గుర్తు చేశారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరిగిందన్నారు. అది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఆందోళనలు, ప్రజల వ్యతిరేకత, సుప్రీంకోర్టు జోక్యం వల్లే ఆ ప్రయత్నం తాత్కాలికంగా ఆగిందని ఆయన తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములపై కన్ను వేయడం ఏమాత్రం మంచిది కాదని కేటీఆర్ హెచ్చరించారు. తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ఐఎస్‌బీ భూములను కూడా గుంజుకునే కుట్ర ప్రారంభించిందని ఆరోపించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో దాదాపు పదివేల కోట్ల రూపాయల విలువైన భూమి కుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టు చెప్పినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టలేదని కేటీఆర్ విమర్శించారు. ఆ సమయంలోనే కేంద్రం కఠినంగా వ్యవహరించి ఉంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో సెంట్రల్ యూనివర్సిటీ అయిన ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్ను వేయే ధైర్యం చేసేది కాదన్నారు.
బీఆర్ఎస్ భరోసా
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా సంస్థల భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాబోయే తమ ప్రభుత్వంలో యూనివర్సిటీ విస్తరణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేటాయిస్తామని చెప్పారు. విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామని, అవసరమైతే ఉర్దూ యూనివర్సిటీ భూములను కాపాడుకునేందుకు ఢిల్లీలో కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అంశాన్ని రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తుతారని ఆయన తెలిపారు.
రాహుల్ గాంధీకి సూటి ప్రశ్నలు
దేశంలో మైనార్టీల సంరక్షకుడినని చెప్పుకునే రాహుల్ గాంధీకి ప్రశ్నిస్తూ.. ఉర్దూ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయడమేనా మీ సంరక్షణ? దేశమంతటినుంచి వచ్చి చదువుకుంటున్న మైనార్టీ విద్యార్థుల యూనివర్సిటీని నిర్వీర్యం చేయడమేనా మీ బాధ్యత? అని కేటీఆర్ నిలదీశారు. మొహబ్బత్ కి దుకాణం అని చెప్పుకునే రాహుల్ గాంధీ మాటలకు, విద్యార్థులను రోడ్డుమీద నిలబెట్టే చర్యలకు పొంతన లేదన్నారు.
ఉర్దూ యూనివర్సిటీ త్యాగాలు
యూనివర్సిటీ భూములు ఖాళీగా లేవని, భవిష్యత్తు విస్తరణ కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీల ప్రతిష్టను తగ్గించేలా కుట్ర చేస్తోందని ఆరోపించారు. గతంలో హైదరాబాద్ నగర అవసరాల కోసం యూనివర్సిటీ భూముల నుంచి 32 ఎకరాలను ఔటర్ రింగ్ రోడ్ కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే కాజాగూడ నుంచి నానక్‌రామ్‌గూడ లింక్ రోడ్ కోసం 7 ఎకరాలు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు భూసేకరణకు ఎప్పుడూ వ్యతిరేకించలేదని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ఉద్యమాల ఫలితంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీలు ఏర్పడ్డాయని, అలాంటి త్యాగాల మీద నిర్మితమైన విద్యాసంస్థలను రియల్ ఎస్టేట్ కోసం వాడుకోవడం అత్యంత దారుణమని కేటీఆర్ అన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో నిజాం కాలేజీలో హాస్టల్ అవసరం ఉంటే ప్రభుత్వ నిధులతోనే నిర్మించామని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి అవసరమైన అన్ని సౌకర్యాలు, విస్తరణకు నిధులు కేటాయించి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు.
నిరుద్యోగులపై లాఠీచార్జ్ - తీవ్ర ఖండన
ఇదే సమయంలో, గురువారం నిరుద్యోగులు, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని కూడా కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. నోటిఫికేషన్లు ఎక్కడని ప్రశ్నించినందుకే విద్యార్థులను దారుణంగా తిట్టి, ఘోరంగా లాఠీచార్జీ చేయడం అన్యాయమన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ, ఆ హామీలపై ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే హామీ ఇచ్చి, ఇప్పుడు విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువతను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ వేధించడం దారుణమని ఆయన అన్నారు. నిరుద్యోగుల వెంట, యువత వెంట బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని, తమ విద్యార్థి విభాగం వారికి పూర్తి అండగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.
