Let's talk: editor@tmv.in
యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం

యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం

Pinjari Chand
26 మార్చి, 2026

మంగళవారం అర్థరాత్రి వరకు సుమారు ఏడు గంటలకు పైగా సాగిన విస్తృత చర్చల అనంతరం గుజరాత్ అసెంబ్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును ఆమోదించింది. వివాహం, విడాకులు, వారసత్వం, అలాగే లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌(సహజీవనం)సంబంధాలపై మతపరమైన భేదం లేకుండా ఒకే విధమైన చట్టపరమైన వ్యవస్థను అమలు చేయడం ఈ బిల్లు ఉద్దేశ్యం. ఈ బిల్లు ప్రకారం బలవంతం, మోసం లేదా ఒత్తిడి ద్వారా జరిగే వివాహాలకు గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నారు. అలాగే బహుభార్యత్వం (పోలిగమీ)ను నిషేధించారు. వివాహాలు మాత్రమే కాకుండా లైవ్-ఇన్ సంబంధాల నమోదు కూడా తప్పనిసరి చేశారు. అధికార బీజేపీ ఈ బిల్లును సమానత్వాన్ని తీసుకొచ్చే చారిత్రాత్మక సంస్కరణగా పేర్కొనగా, కాంగ్రెస్ మాత్రం ఇది మౌలిక హక్కులను ఉల్లంఘిస్తోందని ముస్లింలకు వ్యతిరేకంగా ఉందంటూ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేసినప్పటికీ, వాయిస్ ఓట్‌తో బిల్లు ఆమోదం పొందింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. యూసీసీ అమలుపై రాష్ట్రం వేసిన కమిటీ నివేదిక సమర్పించిన వారం రోజులకే ఈ బిల్లు తీసుకువచ్చారు. గుజరాత్‌లో యూసీసీ అమలు చేయడం ద్వారా సమాన న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.

సహజీవన సంబంధాలనూ నమోదు చేయాలి

‘గుజరాత్ యూనిఫామ్ సివిల్ కోడ్–2026’ పేరిట రూపొందించిన ఈ చట్టం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉండటంతో పాటు గుజరాత్‌కు చెందిన ప్రజలు ఇతర ప్రాంతాల్లో నివసించినా వర్తిస్తుంది. అయితే షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీలు), రాజ్యాంగ పరిరక్షణ ఉన్న కొన్ని వర్గాలకు ఈ చట్టం వర్తించదు. ఈ బిల్లులో ప్రధానంగా వివాహాల నమోదు తప్పనిసరి చేయడం, సహజీవన సంబంధాల నమోదు, విడాకులపై ఒకే విధమైన నిబంధనలు, కుమారులు-కుమార్తెలకు సమాన వారసత్వ హక్కులు వంటి అంశాలు ఉన్నాయి. వివాహం 60 రోజుల్లో నమోదు చేయకపోతే రూ.10,000 వరకు జరిమానా విధించనున్నారు. లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌ సంబంధాల నమోదు చేయకపోతే మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.10,000 జరిమానా విధించే నిబంధన ఉంది. ఈ చర్య మహిళల రక్షణ కోసమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మతాచారాల్లో ఎలాంటి జోక్యం ఉండదని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. ఈ చట్టం ద్వారా వివక్ష తొలగించడమే లక్ష్యమని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం హర్ష్ సంగ్ఘవి బిల్లుకు మద్దతు తెలుపుతూ, మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో ఇది కీలకమని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శైలేష్ పరమార్, అమిత్ చావ్డా బిల్లును ఎన్నికల దృష్ట్యా తొందరపాటుగా తీసుకొచ్చారని విమర్శించారు. ముస్లిం సమాజానికి చెందిన ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇది తమ మతపరమైన ఆచారాలపై ప్రభావం చూపుతుందని ఆరోపించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

బిల్లు అమలులోకి వస్తే యూసీసీ అమలు చేసిన రెండో రాష్ట్రంగా గుజరాత్ నిలుస్తుంది. ఇప్పటికే 2024 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ తరహా చట్టాన్ని అమలు చేసింది.

యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం - Tholi Paluku