Let's talk: editor@tmv.in
యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే

యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే

Pinjari Chand
30 జనవరి, 2026

కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కుల ఆధారిత వివక్షను నిరోధించేందుకు తీసుకువచ్చిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహం) నిబంధనలు–2026ను సుప్రీంకోర్టు గురువారం నిలిపివేసింది. ఈ వ్యవహారంలో మృత్యుంజయ్ తివారి, న్యాయవాది వినీత్ జిందాల్, రాహుల్ దేవాన్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నిబంధనలు ప్రాథమికంగా అస్పష్టంగా ఉండి, దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తాయని వ్యాఖ్యానిస్తూ, ప్రస్తుతానికి 2012లో అమల్లో ఉన్న యూజీసీ నిబంధనలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం, ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే సమాజంపై ప్రమాదకర ప్రభావం చూపి, విభజనకు దారితీసే పరిస్థితి ఏర్పడుతుందని మౌఖికంగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, యూజీసీకి నోటీసులు జారీ చేసిన కోర్టు, నోటీసు జారీ చేస్తున్నాం. మార్చి 19లోపు సమాధానం ఇవ్వాలి. అప్పటివరకు యూజీసీ నిబంధనలు–2026 అమలులో ఉండవు. 2012 నిబంధనలే కొనసాగుతాయని ఆదేశించింది.

‘కుల వివక్ష’ నిర్వచనంపై కోర్టు అభ్యంతరం

విచారణ సందర్భంగా రెగ్యులేషన్ 3(సి) — కుల ఆధారిత వివక్షను నిర్వచించే విభాగంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిబంధన భాష పూర్తిగా అస్పష్టంగా ఉంది. దీన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. భాషను తిరిగి సవరించాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది. నిపుణులైన న్యాయవాదులు, న్యాయపండితులతో కూడిన కమిటీ ద్వారా ఈ నిబంధనలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం సూచించింది.

యూజీసీ కొత్త నిబంధనలపై వివాదం

జనవరి 13న యూజీసీ నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం, అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ఈక్విటీ కమిటీలు, హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఆదేశించింది. అయితే, ఈ నిబంధనలు కుల వివక్షను కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకే పరిమితం చేశాయని, దీనివల్ల జనరల్ (నాన్-రిజర్వ్డ్) వర్గాలకు చెందిన విద్యార్థులు ఎదుర్కొనే వివక్షకు సంస్థాగత రక్షణ లేకుండా పోతుందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కారణంగా ఈ నిబంధనలు ఏకపక్షం, బహిష్కరణాత్మకం, వివక్షాత్మకం, రాజ్యాంగానికి, యూజీసీ చట్టం–1956కు విరుద్ధమని పేర్కొంటూ పలువురు పిటిషన్లు దాఖలయ్యాయి.

దేశవ్యాప్తంగా నిరసనలు

కొత్త యూజీసీ నిబంధనలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో, ప్రధానంగా జనరల్ కేటగిరీ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. లక్నోలో, లక్నో యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు యూజీసీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిబంధనలు సమానత్వాన్ని కాపాడడం కంటే క్యాంపస్‌ల్లో కొత్త రకమైన వివక్షను పెంచుతాయంటూ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

కేంద్ర విద్యాశాఖ మంత్రి భరోసా

ఈ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ ఈ చట్టాన్ని ఎవరూ దుర్వినియోగం చేయలేరు. అమలులో ఎలాంటి వివక్ష ఉండదని భరోసా ఇచ్చారు.

బీజేపీ నేత రాజీనామా

యూజీసీ కొత్త విధానాలపై అసంతృప్తితో, రాయ్‌బరేలీ జిల్లా సలోన్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ త్రిపాఠి తన పదవికి రాజీనామా చేశారు. ఈ నిబంధనలు సమాజాన్ని చీల్చేలా ఉన్నాయని పేర్కొంటూ ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

కుల వివక్షను సంస్థాగతంగా ఉపయోగించడం ప్రమాదకరం: అలంకార్ అగ్నిహోత్రి

యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) 2026 కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించిన నేపథ్యంలో, బరేలీ సస్పెండెడ్ సిటీ మేజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యారంగంలో కుల ఆధారిత వివక్షను ఒక సంస్థాగత సాధనంగా మార్చడం అత్యంత ప్రమాదకరం అని హెచ్చరించారు. ఇలాంటి విధానాలు సమాజంలో తీవ్రమైన విభేదాలకు దారి తీసి, దేశంలో అంతర్గత అశాంతిని కూడా కలిగించవచ్చని ఆయన అన్నారు. ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, కుల వివక్ష అంశం చట్టపరమైన పరిధిలో మాత్రమే చర్చకు పరిమితమై ఉండాలే తప్ప, సంస్థాగతంగా దుర్వినియోగం చేయకూడదని అగ్నిహోత్రి అన్నారు. ప్రస్తుతం ఈ నిబంధనలను అర్హతను పక్కనపెట్టి కుటుంబాలను లక్ష్యంగా చేసుకునే సాధనంగా మారుస్తున్నారని ఆరోపించారు.

మీ కుమారుడు చదువులో ప్రతిభావంతుడైతే అతనిపై ఆరోపణలు మోపుతారు, అతని జీతాన్ని దోచుకుంటారు. అలాగే కుమార్తె లేదా కోడలు యూనివర్సిటీలో చదువుకుంటే వారిపైనా ఆరోపణలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విధానాలు సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నాయని, సామాజిక వర్గాల మధ్య దీర్ఘకాలిక సంఘర్షణలు దేశ ఐక్యతకు ముప్పుగా మారతాయని హెచ్చరించారు. రెండు వర్గాలు పరస్పరం పోరాడితే అది దేశానికే నష్టం. దేశంలో పౌరయుద్ధ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. కొన్ని సంవత్సరాల్లో అంతర్గత ముప్పు వల్లే దేశం అసురక్షితంగా మారుతుందని ఆయన అన్నారు.

యూజీసీ, ప్రభుత్వ పాత్రపై ప్రశ్నించగా, పూర్తి స్థాయి నిబంధనల రద్దు అవసరం లేదని అగ్నిహోత్రి అభిప్రాయపడ్డారు. పరిపాలనా కమిటీ ఈ అంశాన్ని పరిష్కరించగలదు. కానీ దీన్ని ఎలాంటి నియంత్రణ లేకుండా అమలు చేస్తే దేశమంతా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. అధికారుల నిర్లక్ష్యమే దేశంలో పెరుగుతున్న సమస్యలకు కారణమని ఆయన ఆరోపించారు.

దేశంలోని సమస్యలకు వీరే బాధ్యులు. తమ పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తోందని వారు ఆలోచించాలని తీవ్రంగా విమర్శించారు.

దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు

న్యాయపరమైన పరిష్కారాలపై మాట్లాడుతూ, బాధిత అధికారులు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఒక అధికారి తన పదవిని కోల్పోవాల్సి వస్తే, అతను సుప్రీంకోర్టుకు వెళ్లాలి. నాకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు. సిక్కులు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సహా అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో వివక్ష ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీస్ చట్టం అమలును ఉదాహరణగా చూపుతూ, చట్టాల ప్రభావంపై సందేహం వ్యక్తం చేశారు. ఎస్సీ–ఎస్టీ చట్టం ఎలా వాడబడుతోందో మనం చూశాం. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా నిబంధనలను మళ్లీ తీసుకురావడం జరిగిందని ఆరోపించారు. ఈ పరిణామాలు సామాజిక ప్రతీకార భావాలను రెచ్చగొడతాయని కూడా ఆయన అన్నారు. ఇప్పుడైతే జనరల్, ఓబీసీ వర్గాలు ప్రతీకారం తీసుకునే పరిస్థితి వస్తుంది. సమాజం ప్రతీకారం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఈ అంశంపై స్పందిస్తూ, రాజ్యాంగం, న్యాయవ్యవస్థకు గౌరవం ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎవ్వరూ వేలెత్తి చూపలేరు. కోర్టులో అభిప్రాయం వ్యక్తం చేయడం అందరి హక్కు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనల నడుమ, యూజీసీ (ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్) రెగ్యులేషన్స్–2026పై సుప్రీంకోర్టు స్టే విధించింది. జనవరి 23న నోటిఫై చేసిన ఈ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, యూజీసీ చట్టం–1956కి వ్యతిరేకమని పిటిషనర్లు సవాల్ చేశారు.