
యూజీసీ, ఎన్‌సీఈఆర్‌టీ వివాదాలు పరిష్కరించవచ్చు : ధర్మేంద్ర ప్రధాన్
యూనివర్సటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈక్విటీ నిబంధనలు, అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) పాఠ్యపుస్తక వివాదాలు ‘నివారించదగ్గవి’ అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా వ్యాఖ్యానించారు. టైమ్స్ నౌ సమ్మిట్‌లో ‘టీచింగ్ ఇండియా@100’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం ఎవరిపైనా వివక్షకు మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. ఈ వివాదాలు ముఖ్యంగా ప్రజలకు ఎలా చూపించారన్న విషయంలో వాటిని పరిష్కరించవచ్చు. యూజీసీ అంశం ప్రస్తుతం భారత సుప్రీం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను దీనిపై బహిరంగంగా మాట్లాడలేను. కానీ ఎవరిపైనా వేధింపులు జరగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని ప్రధాన్ అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎలాంటి వివక్ష చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. కోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం వ్యవస్థను అమలు చేస్తుందని తెలిపారు.
ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తక వివాదంపై మాట్లాడుతూ, కోర్టు కొన్ని సూచనలు ఇచ్చిందని తెలిపారు. కోర్టు పర్యవేక్షణలో కొత్త అధ్యాయం చేర్చాలని సూచించింది. ఇందుకోసం ఇందు మల్హోత్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాం. ఇందులో ఒక మాజీ అటార్నీ జనరల్, ఒక ప్రముఖ విద్యావేత్త ఉన్నారని చెప్పారు. ఈ కమిటీ రూపొందిస్తున్న అధ్యాయం కోర్టుకు సమర్పించిన తర్వాత పాఠ్యపుస్తకంలో చేర్చుతారని వివరించారు. కోర్టు సూచన మేరకు భోపాల్ లా అకాడమీ అంశాన్ని కూడా ఇందులో చేర్చుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ నెల ప్రారంభంలో ఎన్‌సీఈఆర్‌టీ, న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని ప్రస్తావించిన 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంపై సుప్రీం కోర్టు విమర్శలు చేయడంతో క్షమాపణ చెప్పి, ఆ పుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంది. అదే విధంగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులపై వివక్షను అరికట్టేందుకు రూపొందించిన యూజీసీ ( ప్రమోషన్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్సిట్యూషన్స్) రెగ్యూలేషన్స్, 2026పై కూడా వివాదాలు చెలరేగాయి. ఈ నిబంధనలను సుప్రీం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఈ రెండు వివాదాలు సరైన విధంగా నిర్వహించి ఉంటే నివారించవచ్చని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.
