
యూఏపీఏ దుర్వినియోగం అవుతోంది: సుప్రీంకోర్టు న్యాయమూర్తి
2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే విభిన్న అభిప్రాయాలను క్రిమినలైజ్ చేయడం, యూఏపీఏ(ఉప) వంటి చట్టాల కింద అర్థంలేని అరెస్టులు చేయడం వంటి చర్యలు ఉండకూడదని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ స్పష్టం చేశారు. సోమవారం బెంగళూరులో జరిగిన సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) తొలి జాతీయ సదస్సులో మాట్లాడిన ఆయన, ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా జిల్లా న్యాయవ్యవస్థలో 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు న్యాయమూర్తులుగా ఉన్నప్పటికీ, అదే స్థాయి ఉన్నత న్యాయస్థానాల్లో కనిపించడం లేదన్నారు. 1950 నుంచి ఇప్పటివరకు సుప్రీంకోర్టులో మొత్తం 287 మంది న్యాయమూర్తుల్లో కేవలం 11 మంది మాత్రమే మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. ఫాతిమా బీవి నుంచి జస్టిస్ బీవీ నాగరత్న వరకు ఈ సంఖ్య చాలా తక్కువగా ఉందని అన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 14 శాతమే ఉందని, 25 హైకోర్టుల్లో కేవలం రెండు మహిళా చీఫ్ జస్టిస్‌లు మాత్రమే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో మరొకరు బాధ్యతలు చేపట్టినా, ఇది సరిపోదని అన్నారు. భారతదేశం నిజంగా వికసిత దేశంగా మారాలంటే న్యాయవ్యవస్థలో లింగ సమానత్వం ఉండాలి. సుప్రీంకోర్టు దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించే ‘రెయిన్‌బో ఇన్‌స్టిట్యూషన్’ కావాలని చెప్పారు.
‘ఉప’లో ఐదు శాతమే నేర నిర్ధారణ
యూఏపీఏ (అన్‌లాఫుల్ అక్టివిటిస్ (ప్రివెన్షన్ ) యాక్ట్) అమలుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్ భుయాన్, 2019–2023 మధ్య వేలాది మందిని అరెస్ట్ చేసినప్పటికీ, నేర నిర్ధారణ శాతం సుమారు 5 శాతమే ఉందన్నారు. ఇది చట్టం ఏవిధంగా ఉపయోగించబడుతోందో లేక దుర్వినియోగం అవుతోందో సూచిస్తోందని వ్యాఖ్యానించారు. చాలా అరెస్టులు తగిన ఆధారాలు లేకుండా ముందుగానే జరిగాయి. దీని వల్ల న్యాయవ్యవస్థపై భారీ భారం పడుతోందని తెలిపారు. అభిప్రాయ భేదాలను అణచివేయకుండా గౌరవించాలని, విమర్శలను సహించగల సంస్కృతి ఉండాలని ఆయన పేర్కొన్నారు. డిబేట్‌ను క్రిమినలైజ్ చేయకూడదు. విభిన్న అభిప్రాయాలను గౌరవించాలని అన్నారు. సమాజంలో ఇంకా ఉన్న అసమానతలపై కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళ వండిన ఆహారం తినబోమని చెప్పే పరిస్థితులు ఉండకూడదు. దళితులను అవమానించే ఘటనలు చోటు చేసుకుంటే అది వికసిత భారత్ కాదని స్పష్టం చేశారు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన మాజీ సీజేఐ బీఆర్‌గవాయ్ , కొలీజియం సిఫార్సులను ప్రభుత్వం పునరాలోచనకు పంపిన తర్వాత మళ్లీ అదే పేర్లను పంపినా కూడా నియామకాలు జరగని సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
