Let's talk: editor@tmv.in
యూఏఈ జైళ్ల నుంచి త్వరలో 900 మందికి పైగా భారత ఖైదీల విడుదల

యూఏఈ జైళ్ల నుంచి త్వరలో 900 మందికి పైగా భారత ఖైదీల విడుదల

Shaik Mohammad Shaffee
24 జనవరి, 2026

గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీలకు భారీ ఊరట లభించింది. యూఏఈ జైళ్ల నుంచి విడుదల కానున్న 900 మందికి పైగా భారతీయుల జాబితాను అక్కడి ప్రభుత్వం అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి అధికారికంగా అందజేసింది. గతేడాది నవంబర్‌లో యూఏఈ అధ్యక్షుడు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు సమాచారం.

జాతీయ దినోత్సవ కానుకగా విడుదల

యూఏఈ ఆవిర్భవించిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏటా డిసెంబరు 2న నిర్వహించే ‘ఈద్ అల్ ఇత్తెహాద్’ (జాతీయ దినోత్సవం) వేడుకల సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. వివిధ నేరాల కింద జైళ్లలో ఉన్న మొత్తం 2,937 మందిని విడుదల చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు. ఖైదీలు జైలు శిక్షతో పాటు చెల్లించాల్సిన ఆర్థిక జరిమానాలను కూడా అధ్యక్షుడే స్వయంగా భరిస్తామని ప్రకటించడం విశేషం. విడుదలైన వారు తమ కుటుంబాలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, సామాజిక ఐక్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ వెల్లడించింది.

మరింత బలోపేతమైన భారత్-యూఏఈ బంధం

ఇటీవల యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్‌లో పర్యటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు సోమవారం ఆయన భారత్‌కు విచ్చేసి, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంపై ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 2026లో భారత్ అధ్యక్షతన జరగనున్న ‘బ్రిక్స్’ సదస్సు విజయవంతానికి యూఏఈ పూర్తి మద్దతు ప్రకటించింది. అలాగే 2026 చివరిలో యూఏఈ నిర్వహించనున్న ఐక్యరాజ్యసమితి నీటి సదస్సుకు భారత్ తన మద్దతును తెలిపింది.

కుటుంబాల్లో కొత్త వెలుగులు

ఏళ్ల తరబడి పరాయి దేశంలో జైలు శిక్ష అనుభవిస్తున్న తమ వారు తిరిగి వస్తున్నారనే వార్తతో వందలాది భారతీయ కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎమిరేట్స్ అధ్యక్షుడి ఈ మానవీయ నిర్ణయం ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘకాల మిత్రత్వాన్ని మరోసారి చాటిచెప్పినట్లయింది.