
యూఎస్ డీల్ లో వ్యవసాయ రంగ ప్రయోజనాలు కాపాడాం: పీయూష్ గోయల్
భారత్–అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో దేశానికి సంబంధించిన ఆహారం, వ్యవసాయం వంటి కీలక సున్నిత రంగాల ప్రయోజనాలు పూర్తిగా కాపాడామని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌కు భరోసా ఇచ్చింది. ఈ ఒప్పందం అమెరికా మార్కెట్లో భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని పెంచుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల అనంతరం, ఆపై రాజ్యసభలో కూడా మంత్రి గోయల్ ఒకే విధమైన ప్రకటన చేశారు. అయితే ప్రతిపక్ష సభ్యులు స్పష్టీకరణలు కోరినా, సభాధ్యక్షులు వాటికి అనుమతి ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సాయంత్రం ఈ ఒప్పందాన్ని ప్రకటించడంతో పాటు, ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన నేపథ్యంలో, పార్లమెంట్‌లో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
మంత్రి గోయల్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 2025లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాత ఇరు దేశాలు సమతుల్యమైన, పరస్పర లాభదాయకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం నిరంతర చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. గత ఏడాది కాలంగా రెండు దేశాల చర్చా బృందాలు వివిధ స్థాయిల్లో విస్తృతంగా చర్చలు నిర్వహించాయని చెప్పారు. ఇరు దేశాలకు విభిన్నమైన, విస్తృత ప్రయోజనాలు ఉన్నందున, తమ తమ ఆర్థిక వ్యవస్థల్లోని కీలక, సున్నిత రంగాలను రక్షించుకోవాలనుకోవడం సహజమే అని ఆయన అన్నారు. ఈ చర్చల సందర్భంగా, ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ, పాడి రంగాల ప్రయోజనాలను కాపాడడంలో భారత బృందం విజయవంతమైందని గోయల్ స్పష్టం చేశారు. అమెరికాకు కూడా కొన్ని సున్నిత అంశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సుంకం, అమెరికా ఇతర పోటీ దేశాలపై విధిస్తున్న సుంకాల కంటే తక్కువగా ఉండటం వల్ల, అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులకు పోటీ ప్రయోజనం లభిస్తుందని గోయల్ వివరించారు. ముఖ్యంగా కూలీ ఆధారిత రంగాలు, తయారీ రంగంలో భారత ఎగుమతిదారులకు ఇది పెద్ద ప్రయోజనం అవుతుందని చెప్పారు.
అందరికీ అవకాశాలు లభిస్తాయి
ఈ గౌరవ సభకు మరోసారి స్పష్టం చేయదలుచుకున్నది ఏమిటంటే ఆహారం, వ్యవసాయ రంగాల్లో భారతదేశానికి సంబంధించిన ప్రధాన సున్నిత అంశాలన్నీ పూర్తిగా రక్షించామని స్పష్టంగా చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలు, నైపుణ్య కార్మికులు, పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, ఆధునిక సాంకేతికతలకు ప్రవేశం కలుగుతుందని తెలిపారు.
ఇది ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్, డిజైన్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ ఇన్ ఇండియా’ అనే భారత దృష్టిని ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ఈ చారిత్రక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం, భారత్–అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, అలాగే వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో కీలక అడుగుగా నిలుస్తుందని గోయల్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సహజ భాగస్వామ్యానికి ఇది ప్రతిబింబమని అన్నారు. తదుపరి దశల్లో, ఈ ఒప్పందానికి సంబంధించిన సాంకేతిక ప్రక్రియలు, పేపర్ పనులను పూర్తి చేసి, దాని పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. భారతదేశ ఇంధన వనరులపై ప్రతిపక్షాలు లేవనెత్తిన సందేహాలపై స్పందిస్తూ 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ఇంధన వనరులను విభిన్నంగా చేసుకోవడమే ప్రభుత్వ వ్యూహమని చెప్పారు.
ఆయా రంగాల్లో అమెరికా అగ్రగామి
అమెరికా నుంచి సరఫరాల విషయానికొస్తే, భారత్–అమెరికా ఆర్థిక వ్యవస్థలు పరస్పరంగా అనుకూలమైనవని తెలిపారు.
వికసిత్ భారత్ దిశగా ప్రయాణిస్తున్న భారత్‌కు ఇంధనం, విమానయానం, డేటా సెంటర్లు, అణు విద్యుత్ వంటి రంగాల్లో భారీ సామర్థ్య వృద్ధి అవసరం అవుతుందని చెప్పారు. ఈ రంగాల్లో అమెరికా ప్రపంచ నాయకుడని, అందుకే వాణిజ్య అవకాశాలపై దృష్టి పెట్టడం సహజమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో కుదిరిన ఈ ఒప్పందం, దేశ ప్రజల విస్తృత జాతీయ ప్రయోజనాల కోసమే అని స్పష్టం చేశారు. ఇది వికసిత్ భారత్తో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను కూడా బలోపేతం చేస్తుందని అన్నారు. రాజ్యసభలో గోయల్ ప్రకటన ముగిసిన వెంటనే ప్రతిపక్షాలు వివరణలు కోరినా, ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ వాటిని అనుమతించలేదు. దీనిపై స్పందించిన సభానాయకుడు జేపీ నడ్డా, ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని, అయితే ప్రతిపక్షం గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. తరువాత సోషల్ మీడియా వేదికగా మంత్రి గోయల్, సభలో ప్రకటన ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షం రాద్ధాంతం చేయడంతో సాధ్యపడలేదని పేర్కొంటూ, తన పూర్తి ప్రకటనను ‘ఎక్స్’లో విడుదల చేశారు.
