
యువ ఆవిష్కర్తలకు అండగా 'ఇన్నోవేషన్ పంచాయతీ'
యువతలోని సృజనాత్మకతను వెలికితీసి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ కరీంనగర్‌లోని ఐటీ టవర్‌లో 'ఇన్నోవేషన్ పంచాయతీ' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సదస్సులో 7 జిల్లాల నుంచి 60కి పైగా స్టార్టప్‌లు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, ఆవిష్కర్తలు కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పోటీతత్వాన్ని కలిగి ఉండాలని సూచించారు. కేవలం ప్రభుత్వ మద్దతుపైనే ఆధారపడకుండా, తమ వ్యాపారాలను స్వయం సమృద్ధిగా మార్చుకోవాలని పెద్ద ఎత్తున విస్తరించేలా పరిష్కార మార్గాలను అన్వేషించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆవిష్కర్తలకు నిధుల మంజూరు, వ్యాపార విస్తరణ, మార్కెటింగ్ వ్యూహాలపై సలహాలు అందించారు. ఈ విధంగా వారి ఆవిష్కరణలు కేవలం వినూత్నమైన ఆలోచనలుగా కాకుండా, వాస్తవ ప్రపంచ సమస్యలకు ఉపయోగపడే పరిష్కారాలుగా మారేలా ప్రోత్సహించారు.స్టార్టప్‌లు తమ ప్రాజెక్టుల కోసం పెట్టుబడులను ఎలా ఆకర్షించాలో ఈ సందర్భంగా వివరించారు.
క్రీడా, ఆరోగ్య, శిక్షణ, ఆర్థిక సేవల వంటి విభిన్న రంగాల్లో కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి ఈ పంచాయతి అవినీతిరహిత వేదికగా నిలిచింది. టీజీఐసీ యువ ఆవిష్కర్తలను వారి ఆలోచనలు, స్టార్టప్‌ల ద్వారా దేశ ఆర్ధిక వృద్ధికి దోహదం చేసేవి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం యువ శక్తిని ప్రేరేపించి, తెలంగాణలో సృజనాత్మకత, ఆవిష్కరణలో కొత్త దిశను చూపింది.
