Let's talk: editor@tmv.in
'యువ ఆపద మిత్ర' శిక్షణ పూర్తి చేసుకున్న 78 మంది వాలంటీర్లు

'యువ ఆపద మిత్ర' శిక్షణ పూర్తి చేసుకున్న 78 మంది వాలంటీర్లు

Gaddamidi Naveen
24 డిసెంబర్, 2025

హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన వారం రోజుల ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న యువ ఆపద మిత్రులు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. ఆపద సమయంలో తమను తాము ఎలా రక్షించుకోవాలి, చుట్టుపక్కల వారిని ఎలా కాపాడాలి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తొలి స్పందనదారులుగా ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై వారికి సమగ్ర అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 78 మంది వాలంటీర్లకు మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ధ్రువపత్రాలు అందజేశారు.

ఎన్‌డీఎంఏ (జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ) ప్రారంభించిన ‘యువ ఆపద మిత్ర’ పథకంలో భాగంగా నిజామాబాద్ జిల్లా గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఎంపికైన ఈ వాలంటీర్లకు గత బుధవారం హైడ్రాలో శిక్షణ ప్రారంభమైంది. వారం రోజుల పాటు కొనసాగిన శిక్షణలో భాగంగా తరగతి గది బోధనతో పాటు క్షేత్రస్థాయి ప్రాక్టికల్ అనుభవాన్ని కూడా కల్పించారు. శిక్షణ ముగింపు సందర్భంగా కమిషనర్ ఏవీ రంగనాథ్ వాలంటీర్లతో నేరుగా మాట్లాడి, శిక్షణ ఎలా జరిగింది, వారు ఏమేం నేర్చుకున్నారు అనే విషయాలను తెలుసుకున్నారు.

సాధనతోనే ఏదైనా సాధ్యం: కమిషనర్ సూచన

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సాధన చేస్తే సాధించలేనిది ఏమీ లేదు” అని యువ ఆపద మిత్రులను ఉత్సాహపరిచారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలతో పాటు వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు. ప్రమాద సమయంలో గందరగోళానికి లోనుకాకుండా తక్షణ సహాయకులుగా రంగంలోకి దిగాలని, అనంతరం ఇతర విభాగాలతో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని ఆయ‌న‌ తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు శిక్షణలో ప్రాక్టికల్ అంశాలను చేర్చినట్టు వివరించారు. జిల్లాల స్థాయిలోనూ ఇలాంటి శిక్షణలు నిర్వహించాలన్న విద్యార్థుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.

శిక్షణలో భాగంగా పాతబస్తీలోని గుల్జార్ హౌస్ ప్రాంతం, బతుకమ్మ కుంటి వంటి ప్రదేశాలకు వాలంటీర్లను తీసుకెళ్లి అగ్ని ప్రమాదాలు, వరదల సమయంలో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ప్రథమ చికిత్స, వంటింటి ప్రమాదాల నివారణ, వాతావరణ శాఖ సమాచారం అర్థం చేసుకోవడం, ఐసీసీసీ కమాండ్ కంట్రోల్ రూం పనితీరు వంటి అంశాలను ప్రత్యక్షంగా చూపించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, అడిషనల్ కమిషనర్ ఆర్. సుదర్శన్, ఆర్‌ఎఫ్‌వో జయప్రకాష్, డీఎఫ్‌వో గౌతమ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

వాలంటీర్లలో పెరిగిన ధైర్యం

శిక్షణ అనంతరం వాలంటీర్లు మాట్లాడుతూ, ఈ శిక్షణ తమలో ధైర్యాన్ని పెంచిందని, ప్రభుత్వ విభాగాల పనితీరుపై స్పష్టమైన అవగాహన కలిగిందని తెలిపారు. తరగతి గదిలో వినడమే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం ఎంతో ఉపయోగపడిందన్నారు. కేవలం విపత్తు నిర్వహణే కాకుండా, క్రమశిక్షణ సమన్వయంతో పనిచేయడం నేర్చుకున్నామని వారు తెలిపారు. ఈ శిక్షణతో తాము మాత్రమే కాకుండా ఇతరులను కూడా రక్షించే స్థాయికి సిద్ధమయ్యామని సంతృప్తి వ్యక్తం చేస్తూ, హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.