
యువత రాజకీయాల్లోకి రావాలి: ఎంపీ బాన్సురీ స్వరాజ్
దేశ యువత రాజకీయాలను "మురికి ఆట"గా భావించి దూరంగా ఉండకుండా, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు క్రియాశీలకంగా పాల్గొనాలని బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. యువత రాజకీయాలు మురికిగా ఉన్నాయని భావిస్తే, వాటిని శుభ్రం చేయడం కూడా వారే చేయాల్సిన పని అని ఆమె అన్నారు. ఈ దేశం మీది. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించడానికి మీరు విధి నిర్ణేతలు, భవిష్యత్తు నిర్మాణకర్తలు కావాలి అని ఆమె అన్నారు.
మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, మహిళా రిజర్వేషన్ బిల్లుగా పిలవబడే నారీ శక్తి వందన్ అధినియం అమలుతో పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం మహిళలకు అవకాశాలు లభిస్తాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఉన్న 18వ లోక్‌సభ మహిళలు తక్కువగా ఉన్న చివరి లోక్‌సభ కావాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలు విధాన రూపకల్పనలో భాగస్వాములు కావాలంటే రాజకీయాల్లో, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్లో, ముందుకు రావడం అవసరమని ఆమె స్పష్టం చేశారు.
నేటి జెన్-జీ, మిలీనియల్స్ తమ ముందటి తరాలకు ఆధునిక సాంకేతికతను నేర్పించాలని కోరారు. ముఖ్యంగా తల్లులకు బ్యాంకింగ్‌కు వెళ్లకుండానే ఫోన్ ద్వారా ఎఫ్డీలు చేయడం, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం వంటి డిజిటల్ లావాదేవీలను నేర్పించాలని సూచించారు.డిజిటల్, ఆర్థిక అవగాహన పెంపు కూడా అభివృద్ధి చెందిన భారత లక్ష్యానికి ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.
మహిళా నేతృత్వంలో అభివృద్ధి
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా సాధికారత అనేది కేవలం రాజకీయ నినాదం కాదని, అది క్షేత్రస్థాయిలో అమలవుతోందని ఆమె పేర్కొన్నారు. దీనికి ఉదాహరణలుగా బేటీ బచావో - బేటీ పడావో, ముద్రా యోజన, లఖ్‌పతి దీదీ, నమో డ్రోన్ దీదీ వంటి పథకాలను ఆమె ఉదహరించారు.
దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె అయిన బాన్సురీ స్వరాజ్, మహిళలు కేవలం విధానాలను అనుసరించడమే కాకుండా, విధానాలను రూపొందించే స్థాయికి ఎదగాలని కోరారు. ఇందుకోసం మహిళలు పెద్ద ఎత్తున ఎన్నికల రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
