
యువత క్రీడల్లో రాణించాలి :
క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు క్రీడా ప్రాంగణాల అభివృద్ధి అత్యంత ఆవశ్యకమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని చారిత్రాత్మక బ్రహ్మానంద రెడ్డి (బీఆర్) స్టేడియం పునరుద్ధరణ పనులకు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ స్టేడియం కేవలం ఒక ఆట స్థలం మాత్రమే కాదని వేలాది మంది క్రీడాకారుల కలలకు రెక్కలు ఇచ్చే ఒక దేవాలయమని అభివర్ణించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ స్టేడియం దుస్థితికి చేరిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆమె తెలిపారు.
కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో 'ఖేలో ఇండియా' పథకం కింద రూ. 17 కోట్ల నిధులు మంజూరవ్వడం గుంటూరు క్రీడారంగానికి ఒక గొప్ప వరమని ఎమ్మెల్యే కొనియాడారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ మల్టీ-స్పోర్ట్స్ సదుపాయాలను కల్పించనున్నట్లు ఆమె వివరించారు. ఈ స్టేడియానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని గతంలో పి.టి. ఉషా వంటి దిగ్గజ క్రీడాకారిణులు ఇక్కడ తమ ప్రతిభను చాటుకున్నారని అదేవిదంగా అనేక రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు ఇది వేదికగా నిలిచిందని ఆమె గుర్తుచేశారు. ఈ వైభవాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కూడా అసెంబ్లీలో సమీక్షా సమావేశాల్లో నిధుల కోసం నిరంతరం కృషి చేశారని ఆమె వెల్లడించారు.
గుంటూరు సమగ్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గుంటూరు ఛానల్ విస్తరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, నందివెలుగు, వెంగళాయపాలెం ట్యాంక్ వంటి కీలక ప్రాజెక్టులకు ఆయన వేల కోట్ల నిధులు సాధించారని ప్రజల సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించే అరుదైన నాయకత్వం ఆయనదని ప్రశంసించారు. రాష్ట్ర బడ్జెట్‌లో కూడా క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని, యువత కేవలం చదువులకే పరిమితం కాకుండా క్రీడల్లో కూడా రాణించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.
అయితే స్టేడియం అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని దీనిని పవిత్రంగా భావించి సంరక్షించుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజలు,క్రీడాకారులపై కూడా ఉందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. ఆధునిక వసతులతో సిద్ధమవుతున్న ఈ స్టేడియం రాబోయే రోజుల్లో ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
