Let's talk: editor@tmv.in
యువత కోసం రాహుల్ పోరాటం.. మద్దతుగా సీఎం రేవంత్

యువత కోసం రాహుల్ పోరాటం.. మద్దతుగా సీఎం రేవంత్

Gaddamidi Naveen
22 జులై, 2026

న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం (లోక్ కళ్యాణ్ మార్గ్) వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం తన పూర్తీ సంఘీభావాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ భారత యువతకు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. భారతదేశ ఆశాకిరణం రాహుల్ గాంధీ మన దేశ భవిష్యత్తు కోసం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా రాజీనామాలు డిమాండ్ చేస్తూ పోరాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టిన యువతకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. భారత యువతారా.. మేమంతా మీకు తోడుగా ఉన్నాం. 'కాంగ్రెస్ హ్యాండ్.. యువా కే సాత్' (కాంగ్రెస్ చేయి.. యువతతోనే) అని పేర్కొన్నారు.

ధర్నా నేపథ్యం..

నీట్ పేపర్ లీకేజీ అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర అగ్రనేతలు ప్రధాని నివాసం వద్ద ధర్నాకు దిగారు. ప్రధాని మోడీ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

దాదాపు 20 నిమిషాల నిరసన అనంతరం ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ నిరసన స్థలానికి వచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడి, ధర్నా విరమించాలని కోరారు. ఈ ఆందోళనలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, కేరళ నేత వి.డి. సతీశన్, పలువురు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొని ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.